Cm Stalin: తమిళనాడులో.. ప్రపంచస్థాయి మేధస్సు

18 May, 2022 08:54 IST|Sakshi

నాన్‌ ముదల్వన్‌ పథకంతో సాధిస్తాం 

పేదల ముంగిటకే వైద్యం 

ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడి

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచం మొత్తం మీద మేధస్సు, నైపుణ్యం కలిగిన విద్యార్థులు తమిళనాడులోనే ఉండేలా నాన్‌ ముదల్వన్‌ అనే పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెప్పారు. చెంగల్పట్టు జిల్లా పయనూరులోని సాయ్‌ యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, మరికొన్నింటికి సీఎం స్టాలిన్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, తమిళనాడు ప్రభుత్వ అజమాయిషీలో 13 యూనివర్సిటీలు ఉండగా, నేడు ప్రైవేటు విద్యాసంస్థ అయిన సాయ్‌ యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.

గతంలో ముఖ్యమంత్రి కరుణానిధి ఉన్నతవిద్యకు ప్రవేశ పరీక్షను రద్దు చేశారని గుర్తుచేశారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులో 51.4 శాతానికి పైగా విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘనత కరుణానిధికే చెందుతుందన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్యలో ప్రవేశపరీక్ష రద్దును సుప్రీంకోర్టు ద్వారా ఆయన సాధించారని గుర్తు చేశారు. అందుబాటులోకి సంచార వైద్య వాహనాలు పేదల ఆరోగ్య సంరక్షణకై రెండోదశ సంచార వైద్యసేవలను సీఎం స్టాలిన్‌ మంగళవారం ప్రారంభించారు. తొలిదశలో ఏప్రిల్‌ 8వ తేదీన 133 సంచార వైద్యవాహనాలను, మలిదశగా మంగళవారం 256 సంచార వైద్య వాహనాలను జెండా ఊపి ఆవిష్కరించారు.

ఈసీఆర్‌ ఇకపై.. కలైంజ్ఞర్‌ కరుణానిధి రోడ్డు 
చెన్నై–మహాబలిపురం మధ్యనున్న రహదారి ఈసీఆర్‌ (ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డు)గా పేరుగాంచింది. ఈ రహదారికి స్టాలిన్‌ ప్రభుత్వం ‘కలైంజ్ఞర్‌ కరు ణానిధి రోడ్డు’గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం జీవో జారీ చేసింది.

చదవండి: Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్‌ వేసిన ఎంపీ

మరిన్ని వార్తలు