-

విషాదం: బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు.. 8 మంది మృతి..

29 Jul, 2023 19:15 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో భారీ అగ‍్ని ప్రమాదం జరిగింది.  కృష్ణగిరి వద్ద బాణాసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చిధ్రమై పడి ఉన్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. ఘటనాస్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్లు కూడా కూలిపోయాయి. పలు భవంతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియదు. వారిని బయటికి తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేలు ఇస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

పజాయపెట్టైలో జరిగిన ప్రమాదం భాదకలిగించిందని  సీఎం స్టాలిన్ అన్నారు. బోగనపల్లిలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ బాణాసంచాను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం.. రూ.3లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్షఇవ్వనున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్ని కేటాయించారు. 

ఇదీ చదవండి: కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక భారత్‌లో ఆగిన తల్లి గుండె..

మరిన్ని వార్తలు