తమిళనాడు: సీఎస్, డీజీపీ ఆకస్మిక ఢిల్లీ పయనం

10 Apr, 2021 09:09 IST|Sakshi

టీ.నగర్‌: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ ఆకస్మిక ఢిల్లీ పయనం రాజకీయవర్గాలలో సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో ఎన్నికలు గత ఆరో తేదీన ముగిశాయి. ఓటింగ్‌ యంత్రాలను అన్నింటినీ సీలు వేసి 75 కేంద్రాల్లో ఉంచారు. అక్కడ మూడంచెల భద్రతను కల్పించారు. రాష్ట్రంలో అధికార మార్పు తథ్యం అనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలావుండగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌ రంజన్, హోంశాఖ కార్యదర్శి ఎస్‌కే ప్రభాకర్, అదే శాఖ జాయింట్‌ సెక్రటరీ మురుగన్, రాష్ట్ర డీజీపీ త్రిపాఠి శుక్రవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అందులో డీజీపీ త్రిపాఠి మాత్రం శుక్రవారం రాత్రి చెన్నై తిరిగి వస్తున్నారు. మిగతా ముగ్గురు శనివారం చెన్నై రానున్నారు.

కాగా ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్‌రంజన్‌ గత ఫిబ్రవరి 1న పదవి చేపట్టారు.  ప్రస్తుతం అధికార మార్పు ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలియడంతో ఆయన కేంద్ర ప్రభుత్వ విధులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇలావుండగా కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌ రంజన్, డీజీపీ త్రిపాఠిని హఠాత్తుగా ఢిల్లీకి రప్పించడం సంచలనం కలిగించింది. దీనిగురించి రాష్ట్ర పోలీసు అధికారుల వద్ద విచారణ జరపగా పోలీసు అధికారుల పదోన్నతుల గురించి ప్రతి ఏటా సమావేశాలు ఢిల్లీలో జరుగుతాయని, దీంతో శుక్రవారం, శనివారం ఈ సమావేశాలు జరుగుతున్నాయని, అందులో పాల్గొనేందుకు అధికారులు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుపుతున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మద్దతు పొందిన అధికారులు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాలలో సంచలనం కలిగించింది. 

మరిన్ని వార్తలు