ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

1 Jan, 2023 21:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ అనుసంధానం గడువును ఆ శాఖ తాజాగా పొడిగించింది. శనివారం అధికారులతో జరిగిన సమావేశం అనంతరం మంత్రి సెంథిల్‌ బాలాజీ ఈమేరకు వివరాలను వెల్లడించారు. వివరాలు.. రాష్ట్రంలో విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డు లింక్‌ చేసిన వారికే  విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పిస్తామని తొలుత ప్రకటించారు.

దీంతో విద్యుత్‌ వినియోగదారులలో ఆందోళన నెలకొంది. అదే సమయంలో సాంకేతిక సమస్యలు, ఆన్‌లైన్‌లో నమోదులో జాప్యం వంటి సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. డిసెంబరు 31వ తేదీ వరకు వినియోగదారులకు గడువు ఇచ్చారు. అయితే శుక్రవారం నాటికి 1.63 కోట్ల మంది వినియోగదారులు మాత్రమే తమ ఆధార్‌ను అనుసంధానం చేసినట్లు వెలుగు చూసింది. దీంతో జనవరి 31వ తేదీ వరకు మరో గడువు ఇస్తున్నట్లు విద్యుత్‌ శాఖమంత్రి సెంథిల్‌ బాలాజీ ప్రకటించారు. ఇదే చివరి అవకాశం అని, ఈ నెలాఖరులోపు ఆధార్‌ను అనుసంధానించ ని పక్షంలో ఆ తదుపరి చర్యలకు వినియోగదారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

చదవండి: న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ అంటూ..పాముతో కాటు వేయించుకుని మరీ చనిపోయాడు

మరిన్ని వార్తలు