‌ఇది ప్రభుత్వంపై స్టార్‌ హీరోల నిరసన గళమా?‌

6 Apr, 2021 20:36 IST|Sakshi

చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్‌ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్‌ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్‌, విజయ్‌, విక్రమ్‌, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 


జయం రవి

ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్‌, విజయ్‌, విక్రమ్‌, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్‌ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్‌ సైకిల్‌ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్‌ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్‌ సైకిల్‌ ఎంచుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్‌ కూడా పోలింగ్‌ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. 


శింబు

ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్‌, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్‌ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్‌ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్‌ ఇచ్చేసి ఫోన్‌ తిరిగిచ్చేశాడు.

చదవండి: బెంగాల్‌ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్‌ శాతం ఇలా..

మరిన్ని వార్తలు