Tamilnadu: మహిళా ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. మాజీ డీజీపీకి ఊరట

10 Aug, 2021 07:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: ఓ మహిళా ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన కేసులో మాజీ డీజీపీ రాజేష్‌ దాస్‌ సోమవారం విల్లుపురం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయనకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. వివరాలు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యేక డీజీపీ రాజేష్‌ దాసు ఓ మహిళా ఐపీఎస్‌తో అసభ్యకరంగా వ్యవహరించినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగిన విషయం తెలిసిందే. అప్పటి సీఎం  పళనిస్వామి పర్యటన బందోబస్తుకు వెళ్లి.. చెన్నైకి తిరుగు పయనంలో ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ను కిందకు దించేసి మరీ.. తనను వేధించినట్లు ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.

దీనిని  మరికొందరు ఐపీఎస్‌లు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. వ్యవహారం మీడియాలో రావడంతో అన్నాడీఎంకే పాలకులు విశాఖ కమిటీని రంగంలోకి దించారు. సీబీసీఐడీ సైతం విచారణ చేపట్టింది. రాజేష్‌ దాస్‌తో పాటుగా ఆయనకు వత్తాసు పలికిన పోలీసు అధికారుల మీద సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే రాజేష్‌ దాస్‌ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సోమవారం విల్లుపురం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. దీంతో విచారణకు మాజీ డీజీపీ హాజరయ్యారు. సీబీసీఐడీ 400 పేజీలతో చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాదనల అనంతరం మాజీ డీజీపీకి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

చదవండి: Lockdown Update: ఈనెల 23 వరకు పొడిగింపు: సీఎం

>
మరిన్ని వార్తలు