వ్యాక్సిన్‌ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?

4 Jun, 2021 12:03 IST|Sakshi

చెన్నై: కోవిడ్‌ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ కీలకమని ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మరో పక్క టీకా వేసుకుంటే ఏమౌతుందో అన్న అపోహ ఇంకా పలు చోట్ల ఉండడంతో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో తమిళనాడులో ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది. ఈ లక్కీ డ్రాలో బిర్యానీ, మిక్సీ​ గ్రైండర్‌, 2 గ్రాముల బంగారం, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్‌ మెషిన్‌, స్కూటర్‌ను బహుమతులుగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు టీకా వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు.

వ్యాక్సిన్‌ వేసుకుంటే..బైకు, బంగారం మీకే
కోవలం ప్రాంతంలో సుమారు 7000 జనాభా ఉండగా, గత రెండు నెలల్లో కేవలం 58 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వ్యాక్సిన్‌ వేసుకునే వారి సంఖ్య తగ్గుతుందనే ఆందోళనతో ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఎన్ రామ్‌దాస్ ఫౌండేషన్, ఎస్‌టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్ట్‌కు చెందిన వలంటీర్లు చేతులు కలిపి ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు.

అందులో భాగంగానే వ్యాక్సిన్‌ వేసుకున్నావారికి ఉచిత బిర్యానీ భోజనం అందించడం ప్రారంభించారు. అనంతరం దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, ముగ్గురు వ్యక్తులకు మిక్సీ, గ్రైండర్ , 2-గ్రాముల బంగారు నాణెలను లక్కీ డ్రా ద్వారా ఇవ్వడం ప్రారంభించారు. రాను రాను అందులో విజేతలకు బహుమతిగా రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్‌ను కూడా జత చేర్చారు.  ఈ నేపథ్యంలో కొత్తగా  టీకా వేయించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా ఈ లక్కీ డ్రా వల్ల కేవలం మూడు రోజుల్లో 345 మందికి టీకాలు వేసుకున్నారు. 
 

చదవండి: మంత్రి ప్రకటనపై ప్రజలు హర్షం, ఆ వెంటనే యూటర్న్​..

మరిన్ని వార్తలు