Tamil Nadu Lockdown: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అంటూ చర్చ.. మంత్రి క్లారిటీ

12 Jan, 2022 16:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు అవకాశమే లేదని ఆరోగ్య   మంత్రి సుబ్రమణియన్‌ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ పరీక్షలను రాష్ట్రంలో నిలిపివేయడంతో పాటు.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఉచితంగా పల్స్‌ ఆక్సీమీటర్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ఉద్ధృతి పెరిగింది. గత ఐదురోజులుగా రోజుకు 14 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం కలవరం రేపుతోంది. చెన్నైలో 4072 వీధుల్లో కరోనా వ్యాప్తి చెందింది. ఇందులో 300 మేరకు వీధుల్ని కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి తెచ్చారు. నైట్‌ కర్ఫ్యూను ఈనెల 31 వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యం మినహా తక్కిన కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే, 10,12 తరగతుల విద్యార్థులకు మాదిరి పరీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇక, నైట్‌కర్ఫ్యూను పొడిగిస్తూ సోమవారం రాత్రి వెలువడ్డ ప్రకటనలోని కొన్ని అంశాల మేరకు సంక్రాంతి తదుపరి రాష్ట్రంలో ఫుల్‌ లాక్‌డౌన్‌ అమలయ్యే అవకాశాలు అధికంగానే ఉంటాయన్న చర్చ ప్రారంభమైంది. దీంతో తమ ఆర్థిక పరిస్థితులపై ఆందోళన ప్రజల్లో పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు స్వస్థలాలకు క్యూకట్టారు. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌ తదితర జిల్లాల్లోని వస్త్ర, ఇతర పరిశ్రమల్లోని కార్మికుల్లో లాక్‌డౌన్‌ ఆందోళన కలవరపరిచింది.
చదవండి: నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్‌

ఆర్థిక నష్టాలను అంచనా వేశాకే..
హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి వైద్య చికిత్స అందించడంతో పాటుగా ఉచితంగా ఆక్సిమీటర్ల పంపిణీని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ మంగళ వారం తిరువాన్మీయూరులో ప్రారంభించారు. అడయార్‌లో కమిషనర్‌ గగన్‌ దీప్‌సింగ్‌ బేడీ, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌తో భేటీ అనంతరం మీడియాతో సుబ్రమణియన్‌ మాటాడారు. తమిళనాడులో సంక్రాంతి తర్వాత పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. లాక్‌ కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఆర్థిక కష్టాల్ని సీఎం స్టాలిన్‌ ఇప్పటికే అంచనా వేశారన్నారు.
చదవండి:Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ప్రత్యేక కమిటీ

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన 85 శాతం మందిలో ఎస్‌జీన్‌ చాయలే ఉన్నాయని, వీరికి ఒమిక్రాన్‌ పరీక్ష నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చేలోపు ఆరోగ్యంగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవుతున్నారని పేర్కొన్నారు. అందుకే ఒమిక్రాన్‌ పరిశోధన నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, సీఎం ఎంకే స్టాలిన్‌ బూస్టర్‌ డోసు వ్యాక్సిన్‌చేయించుకున్నారు. ఆరోగ్య రక్షణకు టీకా కవచం అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తిరుపత్తూరు ఎమ్మెల్యే నల్లతంబి, తిరుప్పూర్‌ ఎమ్మెల్యే విజయకుమార్‌ కరోనా బారిన పడ్డారు.  

మరిన్ని వార్తలు