ఇంటింటా ఫీవర్‌ టెస్ట్‌.. మినీ లాక్‌డౌన్‌

26 Mar, 2021 08:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్యకార్యదర్శి ఆర్కే 

చిన్న ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌ 

500 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు 

తమిళ ప్రభుత్వ నిర్ణయం

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ కాదు, మినీలాక్‌ అమలుకు కసరత్తులు చేపట్టినట్టు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి చిన్న చిన్న ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్‌ వేయనున్నారు.  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతోంది. గురువారం 1,779 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో రెండు వేలను దాటే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది తరహాలో మున్ముందు పాజిటివ్‌ కేసులు అధికం అయ్యే పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. అన్ని నగరాలు, పట్టణ కేంద్రలో ప్రత్యేకంగా  ఐదు వందల పడకలతో కోవిడ్ కేర్‌ సెంటర్ల ఏర్పాటును విస్తృతం చేశారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న కేర్‌ సెంటర్లు అనేక జిల్లాల్లో నిండే పరిస్థితి ఉండడంతోనే అదనపు సెంటర్లపై దృష్టి పెట్టారు. చెన్నైలో అయితే, కరోనా శాతం రెండుకు చేరింది. నాలుగు వేల పాజిటివ్‌ వ్యక్తులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో చెన్నైలో సోమవారం నుంచి ఇంటింటా ఫీవర్‌ టెస్టులకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 16 వేల మందితో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఏఏ ప్రాంతాల్లో వైరస్‌ ఉందో, ఆయా ప్రాంతాల్లో ఇంటింటా ఫీవర్‌ టెస్ట్‌ సాగనుంది.  

మినీ లాక్‌డౌన్‌.. 
రాష్ట్రంలో చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కోయంబత్తూరు, తిరుప్పూర్‌ , తంజావూరుల్లో మరీ ఎక్కువగా కేసులు నమోదు అవు తున్నాయి. ఈ ప్రభావం ఇతర జిల్లాల్లోకి సైతం పాకుతోంది. దీంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చర్చ జోరందుకుంది. ఇందుకు తగ్గ ప్రచారం ఊపందుకోవడంతో ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ సంపూర్ణ లాక్‌డౌన్‌కు అవకాశాలు లేవు అని స్పష్టం చేశారు. అయితే మినీ లాక్‌డౌన్‌‌ అమలుకు కసరత్తులు చేస్తున్నామని ప్రకటించారు. ఇది కేవలం వైరస్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తామన్నారు. ఒక వీధి లేదా, ఒక ప్రాంతంలో కేసులు అధికంగా ఉంటే, అక్కడ ఈ మినిలాక్‌ అమల్లో ఉంటుందని వివరించారు. ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతికదూరాల్ని అనుసరిస్తూ, నిబంధనల్ని పాటిస్తే, ఇది కూడా అవసరం లేదన్నారు.  ప్రజలు నిర్లక్ష్యంగా  వ్యవహరించడంవల్లే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తున్నదని, దయ చేసి అందరూ నిబంధనలు పాటించాలని కోరారు.

ప్రేమలతకు నెగటివ్‌..... 
డీఎండీకే కోశాధికారి ప్రేమలతకు కరోనా పరీక్షల్లో నెగటివ్‌ అని తేలింది. దీంతో గురువారం ఆమె పూర్తి స్థాయిలో ఊపిరి పీల్చుకుని ప్రచార బాట పట్టారు. డీఎండీకే పార్టీకి చెందిన చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గ అభ్యర్థి పార్థసారథికి పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రిలో చేరక తప్పలేదు. కాంచీపురం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న 55 మంది విద్యార్థులకు పాజిటివ్‌ రావడంతో అదే కళాశాలలో ప్రత్యేక గదుల్లో వారిని ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

చిన్న ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌.. 
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ విస్తృతం చేశారు. రోజురోజుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ కోసం క్యూ కట్టే వాళ్లు పెరుగుతున్నారు. గురువారం నాటికి 24 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. అందుబాటులో 11 లక్షల మేరకు ఉండగా, మరో 10 లక్షల వ్యాక్సిన్లు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నాయి. ఏప్రిల్‌లో 40 లక్షల మేరకు వ్యాక్సిన్లు తెప్పించేందుకు  కసరత్తులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ వేగం పెరగనుంది. దీంతో చిన్న ఆస్పత్రుల్లోనూ వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మేరకు 1900 చిన్న ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. గురువారం చెన్నైలో 450 మంది పోలీసులకు కరోనా వ్యాక్సిన్‌ వేశారు.  

చదవండి: భయపెడుతున్న కరోనా.. 10 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు