స్టాలిన్‌ సర్కార్‌కు గవర్నర్‌ భారీ షాక్‌.. కీలక బిల్లు వెనక్కి

9 Mar, 2023 07:25 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి భారీ షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును వెనక్కి తిప్పి పంపారాయన. ఆన్‌లైన్‌ జూదంపై నిషేధంతో పాటు ఆన్‌లైన్‌ గేమ్స్‌పై నియంత్రణ కోసం స్టాలిన్‌ సర్కార్‌ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే నెలల తరబడి ఆ బిల్లును పెండింగ్‌లో ఉంచిన గవర్నర్‌ రవి.. ఇప్పుడు దానిని వెనక్కి పంపారు.

తమిళనాడులో ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ కారణంగా.. పదుల సంఖ్యలో ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయి (ఆ సంఖ్య 44కి చేరుకుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది). ఇంతకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వ సమయంలోనూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధానికి సంబంధించి ఒక చట్టం చేసింది. అయితే ఆ సమయంలో కోర్టు దానిని కొట్టేసింది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మాజీ జడ్జి జస్టిస్‌ కే చంద్రు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది. ఆయన ప్రతిపాదనల మేరకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లును రూపొందించింది స్టాలిన్‌ సర్కార్‌.  కిందటి ఏడాది అక్టోబర్‌లో తమిళనాడు అసెంబ్లీలో బిల్లు పాస్‌ అయ్యింది కూడా. 

ఆపై బిల్లును రాజ్‌భవన్‌కు పరిశీలనకు పంపింది. అయితే గవర్నర్‌ రవి ఆ బిల్లుకు (మొత్తం 20 బిల్లుల దాకా పెండింగ్‌లోనే ఉంచారాయన) క్లియరెన్స్‌ ఇవ్వకపోగా.. ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్షాలు సైతం గవర్నర్‌ తీరును తప్పుబట్టాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు.. బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయానికి బిల్లును తిప్పి పంపించారు. దీంతో అధికార డీఎంకే మండిపడుతోంది. 

ఇదిలా ఉంటే.. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న 20 బిల్లుల్లో యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలనే బిల్లు సైతం ఉండడం గమనార్హం. మరోపక్క గవర్నర్‌ తీరును ప్రభుత్వం ఏకిపారేస్తోంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ.. బీజేపీ, ఆరెస్సెస్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శిస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్‌ సైతం గవర్నర్‌ తీరును నిరసిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన. అయితే  ఎన్ని విమర్శలు చెలరేగినా.. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తానని గవర్నర్‌ రవి తేల్చేశారు.

మరిన్ని వార్తలు