ఆంక్షలు: ఆర్‌టీపీసీఆర్‌ తప్పనిసరి చేసిన తమిళనాడు ప్రభుత్వం

1 Aug, 2021 16:37 IST|Sakshi

కేరళ నుంచి తమిళనాడు వచ్చే ప్రజలపై ఆంక్షలు

ఈనెల (ఆగస్టు) 5 నుంచి ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ తప్పనిసరి: తమిళనాడు ప్రభుత్వం

చెన్నై: కేరళ నుంచి తమిళనాడు వచ్చే ప్రజలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కేరళ నుంచి వచ్చే ప్రజలు తప్పకుండా ఆర్‌టీపీసీఆర్‌ నివేదికను వెంట తెచ్చుకోవాలని తెలిపింది. కాగా, గత కొన్ని రోజులుగా కేరళలో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరగడంతో తమిళ నాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు 5 నుంచి కేరళ నుంచి తమిళనాడుకు వచ్చే ప్రజలకు ఆర్‌టీపీసీఆర్‌ నివేదిక తప్పనిసరని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి  సుబ్రహ్మణ్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఒక్కరోజే కేరళ రాష్ట్రంలో 20,624 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఐదు రోజుల్లోనే మొత్తం లక్ష మందికి పైగా ప్రజలు కరోనా బారినపడ్డారు.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ ప్రోటోకాల్‌లను పాటించే విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రజలను హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభాలో 50 శాతం మంది కోవిడ్ బారిన పడే అవకాశం ఉందని, కొత్త రకం డెల్టా వైరస్ కూడా తీవ్రమైనదని అన్నారు. రాష్ట్రంలో టీకా ప్రక్రియ ముగియకముందే మూడో వేవ్ సంభవిస్తే.. అప్పుడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉండవచ్చు అని జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం నుంచి కర్ణాటక కూడా కేరళ, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా పరీక్షలను తప్పనిసరి చేసింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్‌టీసీఆర్‌ పరీక్ష లేదా టీకా రెండు డోసులు వేయించుకున్న సర్టిఫికెట్‌ తప్పనిసరని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 49 కోట్ల మందికిపైగా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు