Tamil Nadu Lockdown: మరిన్ని సడలింపులు.. నేటి నుంచి అమల్లోకి

23 Aug, 2021 15:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఇంటింటికీ టీకా

వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు 

చెన్నైలో శ్రీకారం  

ఇక, ఆస్పత్రుల్లో 24 గంటల వ్యాక్సిన్‌ డ్రైవ్‌ 

నేటి నుంచి అమల్లోకి మరిన్ని సడలింపులు 

కరోనా థర్డ్‌ వేవ్‌ ఊహాగానాలకు చెక్‌ పెట్టడంతో పాటు.. రెండోదశలో వైరస్‌ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం సీనియర్‌ సిటిజన్లకు ఇంటి వద్దనే టీకా వేయాలని నిర్ణయించింది. వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తూనే సోమవారం నుంచి కోవిడ్‌ ఆంక్షలను మరింతగా సడలించనుంది. 

సాక్షి, చెన్నై : చెన్నై మహానగరంలో 80 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇంటి వద్దకే టీకా డ్రైవ్‌కు ఆదివారం శ్రీకారం చుట్టారు. మండలాల వారీగా ప్రత్యేక వాహనాలతో బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ విస్తృతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు  2 కోట్ల మందికి పైగా టీకా వేశారు. అందరికీ టీకా లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్ని విస్తృతం చేసి ఉన్న నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో తొలి విడతగా 80 ఏళ్లు పైబడ్డ వారికి ఇంటి వద్దకే వెళ్లి టీకా వేయనున్నారు. ఇందుకోసం చెన్నైలోని 15 మండలాల్లో ప్రత్యేక వాహనాలతో బృందాలు రంగంలోకి దిగాయి.

ఈ బృందాల్ని ఆశ్రయించేందుకు మండలాల వారీగా ఫోన్‌నెంబర్లు ప్రకటించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వాహనాలను మంత్రులు నెహ్రు, శేఖర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌ దీప్‌ సింగ్‌బేడీ మీడియాతో మాట్లాడుతూ, కట్టడి చర్యలు విస్తృతం చేయడంతో చెన్నై లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించారు. టీకా డ్రైవ్‌ను విస్తృతం చేయడం కోసం చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇంటింటికీ వ్యాక్సిన్‌.. కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా 19 వేల మంది సీనియర్‌ సిటిజన్లకు టీకా వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు.  ఇప్పటి వరకు  చెన్నైలో 25 లక్షల 14 వేల 228 మందికి తొలిడోస్,  10 లక్షల 54 వేల 704 మందికి రెండు డోస్‌ల టీకా వేశామని వివరించారు. గుడిసె ప్రాంతాల్లోని ప్రజల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.  

జిల్లా ఆస్పత్రుల్లో.. 
జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నుంచి 24 గంటల పాటుగా టీకా డ్రైవ్‌ సాగనుంది. ఏ సమయంలోనైనా ఈ ఆస్పత్రులకు వెళ్లి టీకా వేసుకునేందుకు తగిన ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. చెన్నై  తేనాం పేట డీఎంఎస్‌ ఆవరణలో 24 గంటల టీకా డ్రైవ్‌కు శ్రీకారం చుట్టినానంతరం ఈ విషయంపై ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణ్యన్‌ మాట్లాడుతూ, అందరికీ టీకా లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, సెకండ్‌ వేవ్‌ను పూర్తిగా కట్టడిలోకి తెచ్చే విధంగా చర్యలు విస్తృతం చేశామని వివరించారు. ఇది వరకు నిర్ణీత సమయాల్లో టీకాకు తగ్గ చర్యలు తీసుకున్నామని, ఇక, ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి టీకాలు వేయించుకోవచ్చని సూచించారు. 

థియేటర్లలో కోవిడ్‌ జాగ్రత్తలు.. 
సోమవారం నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను మరింతగా సడలించిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లలో ఆదివారం క్లీనింగ్‌ పనులు వేగంగా సాగాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా సినిమాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఇక, రాష్ట్రంలో బీచ్‌లు, పార్కులు సందర్శకుల కోసం సిద్ధమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కరోనా నిబంధనలకు తగ్గ ఏర్పాట్లు జరిగాయి.

చెన్నై మెరీనా తీరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తగ్గ చర్యలు తీసుకున్నారు. ఇక, ఆంధ్రా, కర్ణాటక వైపుగా బస్సుల్ని రోడ్డెక్కించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో చెన్నైలోని మెట్రో రైలు సేవలు ఇక, ఉదయం 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు సాగనుంది. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైలు సేవలు సాగుతాయి.  

చదవండి: అద్భుతం: 109 రోజులు వెంటిలేటర్‌పైనే.. చివరకు

మరిన్ని వార్తలు