ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం.. వస్త్రధారణ సరిగా ఉండాలన్న మద్రాస్‌ హైకోర్టు

3 Dec, 2022 10:34 IST|Sakshi

చెన్నై: మద్రాస్‌ హైకోర్టు చర్చనీయాంశమైన ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లోకి సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు మధురై బెంచ్‌ తెలిపింది. అయితే.. 

హిందూ మత & ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్‌ అండ్ సిఇ) డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి భక్తులెవరూ తమ ఫోన్‌లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫోన్‌లను గుడి దగ్గర్లో పెట్టుకునేలా స్టాండులు, డిపాజిట్‌ లాకర్లు, టోకెన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని మద్రాస్‌ హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను అన్ని ఆలయాల్లో అమలు అయ్యేలా చూడాలని.. భక్తులెవరూ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపింది.

సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. మొబైల్ ఫోన్‌లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు.  అంతేకాదు.. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు..

తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆలయాల్లోకి అభ్యంతరకర దుస్తుల్లో రాకూడదని, ఇందుకోసం మంచి డ్రెస్‌ కోడ్‌ను ఏర్పాటు చేయించాలని పిటిషన్‌ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు.. తాజాగా సెల్‌ఫోన్‌లను ఆలయాల్లోకి అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు దేశ వారసత్వం, సంస్కృతిని కాపాడే వస్త్రాలను ధరించాలని కూడా భక్తులను ఉద్దేశించి మద్రాస్‌ హైకోర్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు