అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి.. ఫ్రాన్స్‌ యువతిని పెళ్లాడిన తమిళ యువకుడు

6 Sep, 2022 11:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఫ్రాన్స్‌ దేశానికి చెందిన యువతిని తమిళనాడుకు చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ ఆ యువతికి తాళి కాట్టాడు. వివరాలు.. శివగంగ జిల్లా కారైకుడి సమీపంలోని అమరావతి పుదూర్‌కు చెందిన తంగరాజ్‌ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని కొడుకు కలైరాజన్‌ ఫ్రాన్స్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్నప్పుడు, అదే పాఠశాలలో సైకాలజీ చదువుతున్న ఫ్రాన్స్‌ యువతి కయల్‌తో పరిచయం ఏర్పడింది. మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు.

పెద్దల అంగీకారంతో తమిళనాడుకి వచ్చి  కారైకుడి సమీపంలోని అమరావతి బుదూర్‌ కలైరాజా ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం పెళ్లి చేసుకున్నారు. ఫ్రెంచ్‌ అమ్మాయి కయల్‌కు కళైరాజన్‌ బంధువుల సమక్షంలో తాళి కట్టాడు. బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఫ్రెంచ్‌ యువతి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రేమించుకున్నామని, తమిళనాడులో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.   

మరిన్ని వార్తలు