పోలీసుల అదుపులో వైరల్‌ కుర్రపెళ్లికొడుకు.. విస్తుపోయే విషయాలు

12 Oct, 2022 12:57 IST|Sakshi

చెన్నై: సోషల్‌ మీడియా, సినిమాల ప్రభావం.. ముఖ్యంగా పిల్లలపై పెద్దల నిఘా కరువు యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. చెడు వ్యసనాలతో పాటు వయసుకు మించిన పరిణితితో చేయకూడని పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు కడలూరు జిల్లాలో మైనర్‌ల వివాహం వైరల్‌ కావడం సంచలనం సృష్టించింది. 

చిదంబరం జిల్లాలోని గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న బస్టాండ్‌ వద్ద జరిగన మైనర్ల వివాహం తీవ్ర చర్చనీయాంశంగా జరిగింది. ఈ వైరల్‌ ఘటనపై పోలీస్‌ శాఖ సీరియస్‌ అయ్యింది. అమ్మాయి(16)కి పసుపు కొమ్ము కట్టిన మైనర్‌(17)ను ఎట్టకేలకు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు.. అబ్జర్వేషన్‌ హోంకు మైనర్‌ను తరలించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని, ఇలా చేస్తే అయినా అంగీకరిస్తారని స్నేహితులు వాళ్లను ప్రలోభపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అలా స్నేహితుల ప్రోద్భలంతోనే ఇంటర్‌ చదువుతున్న ఆమెను.. పాలిటెక్నిక్‌ చదువుతున్న ఆ అబ్బాయి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు బాలికతో మైనర్‌ బాలుడికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో.. బాలికకు వైద్యపరీక్షలు చేయించారు పోలీసులు. అంతేకాదు.. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తిని గుర్తించి.. ఎస్సీ-ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా.. తమిళనాడు సేలం జిల్లాలో మరో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. 20 ఏళ్ల కాలేజీ యువతి.. మైనర్‌ బాలుడు అయిన తన క్లాస్‌మేట్‌ను వివాహం చేసుకుంది. ఏప్రిల్‌లో ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే అప్పుడే వీళ్లిద్దరూ వివాహం చేసుకుని.. అదే కాలేజీకి చెందిన ఓ సీనియర్‌ ఇంట్లో వీళ్లిద్దరూ కాపురం పెట్టినట్లు తెలుస్తోంది. మైనర్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎట్టకేలకు ట్రేస్‌ చేసి ఇద్దరినీ కనిపెట్టారు. యువతి గర్భవతిగా తేలడంతో.. వైద్య పరీక్షలకు తరలించారు. మరోవైపు ఆమెపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయగా.. కోర్టు జ్యూడీషియల్‌ కస్టడీ విధించింది.

ఇదీ చదవండి: ప్రేమ పేరుతో నిలువునా మోసం 

మరిన్ని వార్తలు