తల్లి రుణం తీర్చుకోవడానికి.. ఓ తనయుడి కష్టాలు 

9 Sep, 2022 08:24 IST|Sakshi
వీల్‌చైర్‌లో తల్లి మృతదేహాన్ని తీసుకెళ్తున్న మురుగానందం 

సాక్షి, చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించింది.. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గనుక పుట్టెడు దుఃఖంలోనూ ఎలాగైన చివరి మజిలీ పూర్తి చేయాలన్న సంకల్పం అతన్ని శ్మశానం వరకు తీసుకెళ్లిగలిగింది. నాలుగేళ్లుగా ఆ తల్లి కోసం తెచ్చిన వీల్‌చైర్‌ అతనికి దిక్కయింది. తల్లి మృతదేహాన్ని అందులో కూర్చోబెట్టుకుని శ్మశానానికి తరలించాడు. ఆదరించే వాళ్లు ఎవరూ లేకపోవడం, ఆర్థిక కష్టాలు పెరగడంతో వీల్‌చైర్‌నే పాడెగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

తిరుచ్చి జిల్లా మనప్పారై భారతీయార్‌ నగర్‌కు చెందిన మురుగానందం ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన తల్లి రాజేశ్వరి(74) అంటే మురుగానందంకు ఎంతో ప్రేమ. నాలుగేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో వీల్‌చైర్‌కు పరిమితం కావడంతో అన్నీ తానై సేవలు చేశాడు. ఇటీవల ఆమె శరీరంపై దద్దుర్లు రావడంతో ఆప్తులు, ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి వైపు రావడం మానేశారు. దురదతో కూడిన ఈ పుండ్లు అంటువ్యాధి అని ప్రచారం జరగడంతో ఆమెకు సేవలు అందిస్తున్న మురుగానందంను కూడా దూరం పెట్టేశారు. 

ఆర్థిక కష్టాలతో..
తల్లిని ఇంట్లోనే ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన మురుగానందకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. రానురాను ఆదరించే వాళ్లు, ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో తల్లికి వైద్యం అందించడం భారంగా మారింది. పనికి వెళ్లలేక ఇంటి పట్టునే ఉండి తల్లిని చూసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో గురువారం వేకువజామున రాజేశ్వరి కన్నుమూసింది. ఆమె ఒంటిపై అధికంగా పుండ్లు ఉండడంతో అంత్యక్రియలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని తెలిసి, ఆర్థిక ఇబ్బందులతో  పాడె కట్టడానికి కూడా డబ్బుల్లేక మృతదేహాన్ని  ఇన్ని రోజులు తన తల్లి కోసం వినియోగించిన వీల్‌చైర్‌నే పాడెగా మార్చేశాడు.

అందులో మృతదేహాన్ని ఉంచి పడిపోకుండా, ఆమె చీర సాయంతో కట్టేశాడు. ఎవరి కంట పడకుండా 2.5 కి.మీ దూరం వీల్‌చైర్‌లోనే శవాన్ని మనప్పారై నగరపాలక సంస్థ ఎలక్ట్రిక్‌ శ్మశాన వాటికకు తీసుకొచ్చాడు. వీల్‌చైర్‌తో వస్తున్న వ్యక్తిని చూసి అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. తన దీన పరిస్థితిని వారికి మురుగానందం విన్నవించాడు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది శ్రీధరన్‌తో పాటు మరికొందరు మురుగానందం పరిస్థితిని అర్థం చేసుకుని తమవంతుగా అంత్యక్రియలకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసి, సాంప్రదాయబద్ధంగా లాంఛనాలను పూర్తి చేయించారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మురుగానందంకు మానసికంగా కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
చదవండి: దేశాలు దాటిన ప్రేమ..తల్లిదండ్రుల అనుమతితో

మరిన్ని వార్తలు