బంపర్‌ ఆఫర్‌.. పట్టిస్తే పది లక్షలు మీవే!

29 Jun, 2022 10:33 IST|Sakshi

పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం కొరడా 

అక్రమార్కుల సమాచారం ఇస్తే ప్రజలతోపాటూ సిబ్బందికీ నజరానా

సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్ను వసూళ్లలో పురోగతి కోసం ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పన్ను ఎగవేతదారులను పట్టిస్తే రూ. 10 లక్షల వరకు బహుమానం ఇస్తామని ప్రకటించింది. అధికారులకు కనీసం సమాచారం ఇచ్చినా తగిన బహుమతి అందుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ కార్యదర్శి జ్యోతి నిర్మలస్వామి ఓ జీఓను ఇటీవల విడుదల చేశారు.  

ప్రోత్సాహకాలకు ప్రత్యేక నిధి 
పన్నులు ఎగవేసేవారి గురించి సమాచారం ఇచ్చేవారికి బహుమానం, ఇతర ఖర్చుల కోసం 2022–23 ఆర్థిక సంవత్సరానికి  వాణిజ్యపన్నుల శాఖకు రూ.1.65 కోట్లు కేటాయిస్తున్నట్లు  మంత్రి మూర్తి ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు. ఇందులో చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి.. పన్ను ఎగవేసిన వారి గురించి అందిన సమాచారం ఆధారంగా రూ.లక్షకు పైగా వసూలైతే ఆ మొత్తం నుంచి 10 శాతం బహుమతిగా ఇస్తారు. పన్ను చెల్లింపులో చోటుచేసుకున్న జాప్యాన్ని బట్టీ సదరు మొత్తంలో 5 శాతం లేదా రూ.10 వేలు బహుమానంగా ఇస్తారు.

రూ.4 లక్షలకు పైగా పన్ను బకాయి పడిన వారి సమాచారం ఇచ్చే వ్యక్తి లేదా బృందానికి ప్రభుత్వ అంగీకారంపై 10 శాతాన్ని బహుమతి పొందుతారు. ప్రభుత్వ సిబ్బందే సమాచారం ఇచ్చినట్లయితే రూ.లక్ష అనే పరిమితి లేకుండా బహుమానం ఉంటుంది. సమాచారం ఇచ్చిన అ«ధికారి ఇలా రూ.4 లక్షల  నుంచి రూ.10 లక్షల వరకు బహుమతి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చెన్నై జోన్‌– 1, జోన్‌– 2, తిరుచ్చిరాపల్లి, మదురై, తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూరు, సేలం, వేలూరు తదితర జిల్లాల్లోని వాణిజ్యపన్నులశాఖకు అవసరమైన నిధులు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. సమాచారం ఇచ్చే సిబ్బందికి రూ.62 లక్షలు, అధికారులైతే రూ.1.04 కోట్లు నుంచి రూ.1.66 కోట్ల వరకు నిధులు బహుమానం నిమిత్తం కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని 2022–23 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నులశాఖకు వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

చదవండి: భార్య చేసిన పనికి.. అత్తింటికి నిప్పు పెట్టిన అల్లుడు

 

మరిన్ని వార్తలు