అధికారుల పైత్యం: రూ. కోటి పన్ను చెల్లించలేదంటూ దినసరి కూలీకి

4 Sep, 2021 21:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై: వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేతదారులను ఏం చేయలేని అధికారులు.. అసలు పన్నంటే ఏంటో తెలియని సామాన్యులపై ప్రతాపం చూపిస్తారు.  వేల కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారంటూ.. సామాన్యులకు నోటీసులు పంపి వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దినసరి కూలీగా పని చేసుకుంటున్న మహిళ ఏకంగా కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందంటూ ఐటీ అధికారులు ఆమె ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ మహిళ షాక్‌లో ఉండి పోయింది. 

ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని.. తమ పరిస్థితి వివరించడంతో అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కానీ ఈ విషయం ఊరంతా పాకడంతో పాపం సదరు మహిళను కూలీకి రావద్దోని ఆదేశించారు ఆమె పని చేసే షూ కంపెనీ అధికారులు. దాంతో అధికారుల తీరుపై మండి పడుతోంది సదరు మహిళ. ఆ వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని ఆంబూర్ మెల్మిట్టలం గ్రామానికి చెందిన జి. క్రిష్ణవేణి(41) అనే మహిళ ఆ ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేసుకుంటూ జీవిస్తుండేది. (చదవండి: తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్‌)

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు ఐటీ అధికారులు క్రిష్ణవేణి ఇంటికి వచ్చారు. ఆమె కోటి రూపాయలు పన్ను ఎగవేతకు పాల్పడిందని తెలిపారు. అధికారుల మాటలు విన్న క్రిష్ణవేణితో పాటు గ్రామస్తులు కూడా ఆశ్చర్యపోయారు. దినసరి కూలీ అంత భారీ మొత్తంలో ప్రభుత్వాన్ని మోసం చేయడం ఏంటని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. (చదవండి: మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’)

అందుకు అధికారులు తమ రికార్డుల ప్రకారం క్రిష్ణవేణి చెన్నై తాంబ్రంలో స్క్రాప్‌ లోహాలను విక్రయించే గిడ్డంగికి యాజమానురాలని.. అంతేకాక ఓ లేదర్‌ కంపెనీని కూడా నడుపుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో క్రిష్ణవేణి కోటి రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడిందని ఆరోపించారు. ఈ మాటలు విన్న క్రిష్ణవేణి, ఆమె భర్త ఆశ్చర్యపోయారు. అసలు తాంబ్రం ఎక్కడ ఉంటుందో తమకు తెలియదన్నారు. అంతేకాక అనారోగ్య సమస్యల  వల్ల ఒకటి రెండు సార్లు చెన్నై వెళ్లినట్లు తెలిపారు. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. 

తప్పుడు సమాచారం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని తెలుసుకున్న అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక కొసమెరుపు ఏంటంటే అధికారులు ఇలా రావడంతో షూ ఫ్యాక్టరీ అధికారులు క్రిష్ణవేణి పనుల నుంచి తొలగించారు. దాంతో అధికారుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది క్రిష్ణవేణి.

మరిన్ని వార్తలు