హెలికాప్టర్‌ బ్రదర్స్‌ అరెస్ట్‌.. చిక్కుల్లో మాజీ మంత్రి..

6 Aug, 2021 08:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఫైనాన్స్‌ మోసం కేసులో హెలికాప్టర్‌ బ్రదర్స్‌ను తంజావూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇక మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ మెడకు అక్రమాస్తుల కేసు ఉచ్చు బిగిసింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన హెలికాప్టర్‌ బ్రదర్స్‌ ఎంఆర్‌ గణేషన్, ఎంఆర్‌ స్వామినాథన్‌ దక్షిణ తమిళనాడులో పలుచోట్ల ఫైనాన్స్‌ సంస్థను నెలకొల్పారు.  సొంతంగా హెలికాప్టర్‌ ఉండబట్టే, తమ పేరుకు ముందు ఈ ఇద్దరు హెలికాప్టర్‌ను చేర్చుకున్నట్టు ఆ జిల్లాలో చెబుతుంటారు. ఈ బ్రదర్స్‌ బీజేపీలోనూ చేరి, రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా కొన్ని బ్రాంచ్‌లను మూసివేసినట్టు,  రెట్టింపు ఆదాయం పేరిట తమను ఈ బ్రదర్స్‌ మోసం చేసినట్టుగా బాధితులు బుధవారం పోలీసుల్ని ఆశ్రయించారు.

దీంతో తంజావూరు పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. తమ పేరిట అతి పెద్ద పాడి పరిశ్రమ ఉన్నట్టు, విదేశాలకు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు, ఫైనాన్స్‌ సంస్థలో రెట్టింపు ఆదాయం అంటూ ఈ బ్రదర్స్‌ కోట్లాది రూపాయల్ని ఆర్జించినట్టు విచారణలో తేలింది. దీంతో గురువారం మధ్యా హ్నం ఈ ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, విరుదునగర్‌జిల్లా రాజపాళయం కేంద్రంగా ఫైనాన్స్‌ సంస్థను నడిపి వందలాది మందిని మోసం చేసిన మరో కేసులో రాధాకృష్ణన్, లోకనాథన్, శంకరనారాయణ, మణిగండన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి చెందిన రూ. ఏడు కోట్ల విలువగల ఆస్తులను గురువారం జప్తు చేశారు. 

చిక్కుల్లో మాజీ మంత్రి..
2011–13 కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీ రాజేంద్ర బాలాజీ అక్రమాస్తులు కేసు కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమార్జనకు సంబంధించిన ఆధారాల అన్వేషణలో డీఎంకే ప్రభుత్వం ఉంది. ఈ విచారణ నిలుపుదలకు రాజేంద్రబాలాజీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను కొనసాగించేందుకు అంగీకరిస్తూ, స్టే ఇవ్వడానికి కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో అక్రమాస్తుల కేసు ఉచ్చు కేటీ రాజేంద్ర బాలాజీ మెడకు బిగిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 

మరిన్ని వార్తలు