తమిళనాడులో టెన్షన్‌.. టెన్షన్‌.. స్కూల్‌ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్‌

17 Jul, 2022 16:49 IST|Sakshi

త‌మిళ‌నాడులో ఉద్రిక్త‌త వాతావరణం చోటుచేసుకుంది. నిరసనకారులు ఓ ప్రైవేట్ రెసిడెన్షియ‌ల్ పాఠశాలలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. స్కూల్‌ బస్సులకు సైతం నిప్పు అంటించి దగ్ధం చేశారు. పోలీసుల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకొని, పోలీసుల కారును కూడా ధ్వంసం చేశారు.

అయితే, తమిళనాడులో కళ్లకురిచ్చిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని‌ శ్రీమతి(17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో, అక్కడికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు.. బాలిక మృతికి ఆ స్కూల్ యాజ‌మాన్య‌మే కార‌ణ‌మని ఆరోపిస్తూ వారితో వాదనకు దిగారు. ఇంతలో కడలూరు జిల్లాకు చెందిన పలు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో పాఠశాలకు వద్దకు చేరుకున్నారు. 

విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు.. పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల ఆవరణలో పార్కింగ్‌ చేసి ఉన్న బస్సులకు నిప్పంటించారు. దీంతో పదుల సంఖ్యలో బస్సులు దగ్ధమయ్యాయి. కాగా, విధ్వంసంపై సీఎం స్టాలిన్‌ స్పందించారు. ఘటనా స్థలానికి వెంటనే.. డీజీపీ, హోంశాఖ కార్యదర్శి వెళ్లాలని ఆదేశించారు. బాలిక మృతిపై పోలీసుల విచార‌ణ పూర్తికాగానే నిందితుల‌ను శిక్షిస్తామ‌న్నారు. నిరసనలు శాంతియుతంగా ఉండాలని కోరారు. 
 

మరిన్ని వార్తలు