12 వైన్‌ బాటిళ్లు ఖాళీ చేసిన ఎలుకలు.. ‘కిక్కు ఎక్కిందో లేదో’

6 Jul, 2021 11:59 IST|Sakshi

ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్‌ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. 

ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్‌డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్‌ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్‌ షాప్‌ తెరిచి చూసేసరికి  12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్‌ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్‌ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది.

ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్‌డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్‌ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు