తమిళనాడులో ఆంక్షల సడలింపులు.. పుదుచ్చేరిలో 16 నుంచి బడులు

12 Jul, 2021 07:39 IST|Sakshi
పుదుచ్చేరి సీఎం ఎన్‌.రంగస్వామి

తమిళనాడులో మరింత కట్టడి

అధికారులతో పూర్ణలింగం కమిటీ భేటీ 

పుదుచ్చేరిలో 16 నుంచి బడులు 

9 నుంచి 12 వరకు తరగతులు 

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు మరింత విస్తృతం చేద్దామని అధికారులకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పూర్ణలింగం నేతృత్వంలోని కమిటీ పిలుపునిచ్చింది. ఇక పుదుచ్చేరిలో ఈనెల 16 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి.  

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పాలకులు చేపట్టిన కట్టుదిట్టమైన చర్యలతో కరోనా కట్టడిలోకి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమవారం నుంచి మరిన్ని ఆంక్షలు సడలించారు. తమిళనాడు నుంచి పుదుచ్చేరికి బస్సుల సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ఆదివారం నుంచి మళ్లీ పుంజుకుంది. వ్యాక్సిన్‌ కొరతతో రెండు రోజులుగా డ్రైవ్‌ ఆగింది. తాజాగా టీకాల రాకతో ఆదివారం ఉదయం నుంచి ఆయా నగరాల్లోని కేంద్రాల్లో టీకాలు వేసే పనిలో ఆరోగ్యశాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. ఆదివారం  నిబంధనల్ని ఉల్లంఘించి జనం బీచ్‌ల వైపు తరలిరావడంతో కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా కట్టడిపై మరింతగా చేపట్టాల్సిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సచి వాలయంలో సమావేశమైంది. పూర్ణలింగం నేతృత్వంలోని 13 మంది సభ్యులతో కూడిన కమిటీ నామక్కల్‌ కవింజర్‌ మాలిగైలో భేటీ అయింది. ఈ భేటీకి సీఎస్‌ ఇరైఅన్భు, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. పూర్తి స్థాయిలో కరోనా కట్టడికి మరింత విస్తృతంగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా చర్యలకు సిద్ధమయ్యారు.  

పుదుచ్చేరిలో బడులు.. 
పుదుచ్చేరిలో కరోనా కట్టడిలోకి వచ్చింది. దీంతో పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు తగ్గట్టుగా అభిప్రాయ సేకరణకు సీఎం రంగస్వామి నిర్ణయించారు. ఆదివారం జరిగిన ఈ అభిప్రాయ సేకరణ అనంతరం రంగస్వామి రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో రంగస్వామి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలలు, కళాశాలలు తెరవనున్నట్టు ప్రకటించారు. 9, 10,11,12 తరగతుల విద్యార్థులకు, కళాశాల స్థాయి విద్యార్థులకు మాత్రమే తరగతులు జరుగుతాయని వివరించారు.

తమిళనాడులోని అన్ని పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయిలో ఫిట్‌ ఇండియా మూమెంట్‌ సర్టిఫికెట్‌ను పొందాల్సిందేనని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల ప్రారంభానికి ముందే ఆయా విద్యా సంస్థలు ఫిట్‌ ఇండియా.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.   ఏడాదిన్నర కాలంగా కరోనా ఆర్థికంగా దెబ్బతీయడంతో అనేక కుటుంబాలు తమ పిల్లల చదువులకు స్వస్తిపలికినట్టు సర్వేలో తేలింది. తొమ్మిదో తరగతి నుంచి ప్లస్‌టూ వరకు 27 శాతం మేరకు విద్యార్థులు బడులు మానేసి ఉండడం గమనార్హం.  

మరిన్ని వార్తలు