వీడియో: పొలిటికల్‌ ఫన్‌.. స్టాలిన్‌ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి

23 Mar, 2023 19:14 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్‌ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్‌గా ఉండే ట్విటర్‌లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్‌ విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా తమిళనాడు బడ్జెట్‌కు సంబంధించిన ఓ మీమ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. బడ్జెట్‌ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్‌ ప్రభుత్వం. సెప్టెంబర్‌ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం.  అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో..  2.2 కోట్ల రేషన్‌ కార్డు హోల్డర్‌లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో..  

సోషల్‌ మీడియాలో మీమ్స్‌ను వైరల్‌ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్‌ ఆఫ్‌ సవుక్కు అనే ట్విటర్‌ పేజీ అడ్మిన్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం  గౌండమణి, సెంథిల్‌లు ఉన్న ఓ వీడియోను ఎడిట్‌ చేశాడు ఆ పేజీ అడ్మిన్‌ ప్రదీప్‌. అందులో ఒకరిని స్టాలిన్‌గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు  ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్‌ చేశారు. 

తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్‌-అరెస్ట్‌ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్‌ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. 

ఆమధ్య స్టాలిన్‌ తనయుడు ఉదయ్‌నిధి స్టాలిన్‌కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్‌ చేసేందుకు గుజరాత్‌ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్‌ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్‌ చేశారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు