ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!

4 Feb, 2023 19:16 IST|Sakshi

చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలోని జిన్నాపాలెం వద్ద మురుగన్‌ తైపుసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల కోసం ఉచిత టోకెన్లు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది మహిళలు తరలివచ్చారు.

అయితే టోకెన్ల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు.వీరిని వెంటనే వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయలపాలైన మరో 12 మంది మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఎస్పీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసిన ప్రైవేట్ సంస్థ యజమాని అయ్యప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: పెండింగ్‌ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు..

మరిన్ని వార్తలు