Tamil Nadu: బాణసంచా పరిశ్రమలో పేలుడు

22 Jun, 2021 07:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా బాణసంచా తయారు చేస్తుండడం అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. బాణసంచా ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం తమిళనాడులోని సాత్తూరులో జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, పేలుడు ధాటికి ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి.

విరుదునగర్‌ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాల్లోని అనేక గ్రామాల్లో కుటీర పరిశ్రమగా ఇళ్లలోనే బాణసంచా తయారీ జరుగుతోంది. సాత్తూరు సమీపంలోని కయాల్‌పట్టి కలైంజర్‌ నగర్‌లో అన్నదమ్ముళ్లయిన సూర్య, ప్రభాకరన్, అబ్బు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంట్లోనే టపాసులు తయారుచేస్తున్నారు.

సోమవారం ఉదయం ముడిసరుకు సిద్ధం చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇళ్లు నేలమట్టమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించారు. ఓ ఇంట్లోని శివమణి(35, అతని కుమారుడు రవి(5), శిథిలాలపై పడడంతో సంఘటనా స్థలంలోనే మరణించారు. కర్పగం అనే మహిళ శరీరం చిద్రమైంది. సూర్య, ప్రభాకరన్‌ స్వల్ప గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో సెల్వమణి మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు అబ్బులును అరెస్టు చేయగా, ప్రభాకరన్, సూర్య కోసం గాలిస్తున్నారు.

మరో ఘటన 
కడలూరు జిల్లా పల్లడంపేటకు చెందిన సెంథిల్‌ ఎలాంటి అనుమతి  లేకుండా ఇంట్లో టపాసుల తయారీలో నిమగ్నమై ఉన్నాడు. సోమవారం వేకువజామున ఆ ఇంట్లో పేలుడు చోటు చేసుకుంది. నాలుగు ఇళ్లు పాక్షింగా దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పరారీలో ఉన్న సెంథిల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు