బంగ్లాదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తమిళనాడు యువతి

3 Sep, 2022 10:57 IST|Sakshi

చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు తమ తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు మార్చుకున్నారు.  పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్. 

ఈ వివాహానికి తమ కుటుంబసభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని సుబిక్ష ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈమె తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో సెటిల్ అయ్యారు. సుబిక్ష భార్య టీనా దాస్‌ బంగ్లాదేశ్‌లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు.

ఆరేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించడానికి ఇంత సమయం పట్టిందని సుబిక్ష చెప్పారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చార్టెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సుబిక్ష.. తాను బైసెక్సువల్ అని నిర్మొహమాటంగా చెప్పింది. 19 ఏళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపింది.

మాకు అప్పటిదాకా తెలియదు..
సుబిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్‌ను నడుపుతున్నారు. తాను మదురైలో పెరిగానని, తర్వాత ఖతార్‌లో కొన్నాళ్లు నివసించినట్లు ఆమె వెల్లడించారు. కెనడా వెళ్లిన తర్వాతే తమకు ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందని వివరించారు.  సుబిక్ష ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని భయం వేసిందని చెప్పారు.

ఎల్‌జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియక తల్లిందడ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారని టీనా దాస్ వెల్లడించారు. తనకు ఏదో వ్యాధి ఉందనుకున్నారని పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్ధుకుంటాయని భావించి 19 ఏళ్ల వయసులో తనకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారని వెల్లడించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సుబిక్షను కల్గేరీలోనే కలిసినట్లు వివరించారు.
చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!

మరిన్ని వార్తలు