అమ్మా.. ఆకలి!

29 Apr, 2022 22:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: అమ్మక్యాంటీన్లపై ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం పడింది. దీంతో వీటి నిర్వహణ కార్పొరేషన్లకు భారంగా మారింది.  

నేపథ్యం ఇదీ.. 
2011లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ‘అమ్మ’ పేరిట పథకాల వేగం పెరిగిన విషయం తెలిసిందే. జయలలితను అమ్మగా భావించి ఈ పథకాల్ని హోరెత్తించారు. ఇందులో అమ్మ క్యాంటిన్‌ అందరి కడుపు నింపే అమ్మగా మారింది. అమ్మ సిమెంట్, అమ్మవాటర్, అమ్మ మెడికల్స్, అమ్మ స్కూటర్, అమ్మ ప్రసూతి చికిత్స,  అమ్మ  క్లీనిక్, అంటూ ఎటూ చూసినా అమ్మ పథకాలే అమల్లోకి వచ్చాయి. అయితే, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే పతనమైంది. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మే 7వ తేదీతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది.

ఈ కాలంలో ఎన్నో అమ్మపథకాల్ని తుంగలో తొక్కేశారు. అయితే, అమ్మక్యాంటీన్లను మాత్రం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్యాంటీన్లను నిర్వీర్యం చేయబోమంటూనే, అనేక జిల్లాల్లో గుట్టుచప్పుడు కాకుండా మూత వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  ఇందుకు కారణంగా త్వరలో డీఎంకే దివంగత అధినేత కరుణానిధి పేరిట క్యాంటీన్లు పుట్టుకు రాబోతుండటమే అన్న చర్చ కూడా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని అమ్మ క్యాంటీన్ల పై తీవ్ర ప్రభావం చూపుతోంది.  

నిర్వహణకు నానాపాట్లు.. 
చెన్నై నగరంలో 200 మేరకు క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ఆది నుంచి చౌక ధరకే ఇడ్లీ, చపాతి, సాంబర్‌ అన్న, లెమన్‌ రైస్, వంటి పదార్థాలను అందజేస్తూవస్తున్నారు. వీటికి ఉపయోగించే వస్తువుల్ని ఓ సంస్థ సరఫరా చేస్తోంది. రెండు నెలల క్రితం ఆ సంస్థ వర్గాలు కార్పొరేషన్‌ మీద కన్నెర్ర చేయాల్సి వచ్చింది. తమకు చెల్లించాల్సిన అప్పు రూ. 20 కోట్ల త్వరితగతిన మంజూరు చేయాలని పట్టుబట్టక తప్పలేదు. ఇక ఎట్టకేలకు అప్పు చెల్లించినా, ప్రస్తుతం పాత ధరలకే నిత్యావసర వస్తువుల పంపిణీ సాధ్యం కాదన్న విషయాన్ని ఆ సంస్థ కార్పొరేషన్‌కు స్పష్టం చేసింది.

చెన్నైలోని క్యాంటీన్లను రోజూ రెండు లక్షల మంది పేదలు, కార్మికులు ఉపయోగించుకుంటున్నారు. గతంలో ఉన్నట్టుగా ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రస్తుతం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కార్పొరేషన్‌ వర్గాలు స్పందిస్తూ.., క్యాంటీన్లను ఓ సేవగా తాము కొనసాగిస్తున్నామని, ఇందులో లాభాపేక్ష లేదని స్పష్టం చేశారు. ఏటా రూ. 120 కోట్లు క్యాంటీన్ల నిర్వహణకు ఖర్చు అవుతోందని, ఆదాయం మాత్రం రూ. పది కోట్లుగానే ఉందని వివరించారు. ఆది నుంచి నష్టాలు ఉన్నా, సేవాదృక్పథంతో కొనసాగిస్తున్నామని, ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల కేటాయింపు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


 


 

మరిన్ని వార్తలు