అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్‌

22 Mar, 2021 19:45 IST|Sakshi

చెన్నె: ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంలో తమిళనాడు రాజకీయ నాయకులకు అలవాటే. ఇప్పటికే అక్కడి ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే మేనిఫెస్టోలు విడుదల చేశాయి. దాదాపు 500కు పైగా హామీలు ప్రజలకు ఇచ్చాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. పెద్ద ఎత్తున హామీలు కురిపిస్తూ మేనిఫెస్టో‌ను ప్రకటించింది.

చెన్నైలో సోమవారం కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, వీకే సింగ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని, ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ తీసుకొస్తామని బీజేపీ ప్రకటించింది. 50 లక్షల ఉద్యోగాల కల్పన, మత్య్సకారులకు రూ.6 వేల ఆర్థిక సహాయం, 8, 9 తరగతి విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు, ఇంటింటికీ రేషన్‌ సరుకుల సరఫరా తదితర హామీలు ఇచ్చింది.

అమ్మాయిలకు (18-23 ఏళ్ల వయసు) ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌, ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రజలందరికీ ఉచిత తాగునీరు, చెన్నె కార్పొరేషన్‌ విస్తరణ, దళితులకు 12 లక్షల ఎకరాల భూమి పంపిణీ తదితర హామీలు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకే దశలో ఏప్రిల్‌ 6వ తేదీన జరగనున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.

చదవండి: 
టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి

ప్రధాని ‘ఇంటి ప్రకటన’పై రాజకీయ దుమారం

మరిన్ని వార్తలు