తమిళనాడు సీఎంకు శస్త్రచికిత్స 

20 Apr, 2021 09:04 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ సోమవారం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌కాగా ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. ఈనెల 6న పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి సేలం జిల్లాల్లోని తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం సేలం నుంచి చెన్నైకి చేరుకున్న సీఎం ఎడపాడి తన క్యాంప్‌ కార్యాలయంలో ప్రభుత్వాధికారులతో లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు.

ఆక్సిజన్‌ కొరత.. ఏడుగురి మృతి 
సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగులకు ఆక్సిజన్‌ అందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో సోమవారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అడుక్కంపారై ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులో పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్‌ అందక రాజేశ్వరి (68), ప్రేమ్‌ (40), సెల్వరాజ్‌ (66) సహా ఏడుగురు మృతి చెందారు. ఆక్సిజన్‌ కొరత అని కొందరంటుండగా, ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, వేర్వేరు కారణాలతో రోగులు మృతిచెందారని వేలూరు కలెక్టర్‌ షణ్ముగ సుందరం, ఆస్పత్రి డీన్‌ సెల్వి తెలిపారు. కరోనా సెకెండ్‌ వేవ్‌తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. రోజుకు 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సోమ వారం 10,941 కేసులు నిర్ధారణ అయ్యాయి. 44 మంది మృతి చెందారు.  

చదవండి: నేతల ఆట విడుపు.. కొడైకెనాల్‌లో తిష్ట

మరిన్ని వార్తలు