నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..

15 Sep, 2021 19:02 IST|Sakshi

ఐదంతస్థుల భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య 

సాక్షి ప్రతినిధి, చెన్నై: చదువు భారమై.. మానసిక ప్రశాంతతకు దూరమై ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని దారుణమైన రీతిలో తల్లిదండ్రుల ముందే ప్రాణాలు తీసుకుంది. ఈ దయనీయమైన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన తంగకుమార్‌ తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లాలోని సిమెంట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

ఇతడి కుమార్తె అబిదా (19) శ్రీపెరంబుదూరులోని ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. చదువంటే ఇష్టం లేదు.. అమ్మానాన్నల బలవంతం మీద కాలేజీలో చేరానని హాస్టల్‌లోని తోటి విద్యార్థుల వద్ద తరచూ వాపోయి.. మానసిక కుంగుబాటుకు లోనైంది. ఈ విషయం ప్రిన్సిపల్‌కు తెలియడంతో తల్లిదండ్రులను పిలిపించాడు. అమ్మాయి బాగా కోలుకున్న తరువాత ఆమెకు ఇష్టమైతేనే కాలేజీకి పంపాలని ఆయన సూచించగా వారు సమ్మతించారు.

సోమవారం రాత్రి ఇంటికి బయలుదేరే ముందు.. హాస్టల్‌ గదిలో ఉన్న సామాన్లు తెచ్చుకుంటానంటూ తల్లిదండ్రులను గౌండ్‌ ఫ్లోర్‌లో కూర్చోబెట్టి అబిదా మిద్దెపైకి వెళ్లింది. ఐదో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లముందే అబిదా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు, హాస్టల్‌ సిబ్బంది తల్లడిల్లిపోయారు.

మరో ఘటనలో..

తమ్ముడు తిట్టాడని మరో విద్యార్థిని..
చెన్నై తిరువీక నగర్‌కు చెందిన అశోకన్‌కు ప్లస్‌ వన్‌ చదువుతున్న కుమార్తె కావ్య (17) ఉంది. ఆమెకు, తమ్ముడికి మధ్య సోమవారం వాదులాట చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చజెప్పి బయటకు వెళ్లారు. మనస్థాపానికి గురైన కావ్య గదిలోకి వెళ్లి ఉరివేసుకుంది. అక్కను చూసి ఆందోళన చెందిన తమ్ముడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారొచ్చి కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్‌.. తట్టుకోలేక..

మరిన్ని వార్తలు