Auto Charges Hike In Tamilnadu: త్వరలో ఆటో చార్జీలు పెంపు?

9 Jun, 2022 07:41 IST|Sakshi

ఈ మేరకు సిఫార్సు చేసిన ప్రత్యేక కమిటీ

సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఆటో చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు నియమించిన ప్రత్యేక కమిటీ అన్ని వర్గాల అభిప్రాయాలను క్రోడీకరించి పెంపునకు మొగ్గుచూపాలని సిఫార్సు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పని సరి చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వమే అప్పటి నుంచి చార్జీలను నిర్ణయిస్తోంది. ఆ సమయంలో కనిష్ట చార్జీగా రూ. 25, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ.12 అదనంగా నిర్ణయించారు. రాత్రుల్లో 50 శాతం మేరకు చార్జీలను పెంచుకునే అవకాశం కల్పించారు.

ఆ తర్వాత చార్జీల పెంపుపై దృష్టి సారించలేదు. ఈకాలంలో పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు అమాంతం పెరగడం వెరసి మీటర్లు వేసే ఆటో డ్రైవర్లే కరువయ్యారు. వారు నిర్ణయించిన చార్జీలను.. ప్రయాణికులు చెల్లించుకోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీలపై దృష్టి పెట్టింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు సమ్మతిస్తూ.. ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింది. ఈ మేరకు కనిష్ట చార్జీ రూ.40గా నిర్ణయించాలని, ఆ తర్వాత ప్రతి కి.మీ దూరానికి రూ. 18గా చార్జీ అదనంగా నిర్ణయించారు. అయితే ఆటో సంఘాలు మాత్రం కనిష్టచార్జీ రూ.50గా నిర్ణయించాలని పట్టుబడుతున్నాయి. ఈనేపథ్యంలో సీఎం స్టాలిన్‌ ఆమోదం తర్వాత ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఆటో చార్జీలను సవరించే అవకాశం ఉంది.

చదవండి: స్కూటర్‌ని ఢీ కొట్టిన మోటార్‌ బైక్‌: షాకింగ్‌ వీడియో

మరిన్ని వార్తలు