ద్విసభ్య కమిషన్‌.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా?

24 Nov, 2021 09:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ కేసు విచారణకు అవసరమైతే ద్విసభ్య కమిషన్‌కు సిద్ధమేనని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వాదనలు వినిపించింది. ఈ కేసు మిస్టరి నిగ్గుతేల్చేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ సాగుతోంది.

అదే సమయంలో విచారణ వలయంలో తమను ఈ కమిషన్‌ తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ అపోలో యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. తాజాగా అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు సైతం విచారణను త్వరితగతిన ముగించాలని ఆ కమిషన్‌కు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో అపోలో యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో  నెలన్నర రోజులుగా విచారణ సాగుతోంది. మంగళవారం మళ్లీ పిటిషన్‌ విచారణకు రాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కమిషన్‌కు అండగా బలమైన వాదనలు వినిపించారు. 

నిపుణుల బృందం కాదు 
జయలలిత మరణం కేసు మిస్టరీలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకే కమిషన్‌ ఏర్పాటైందని, ఇది నిపుణుల కమిటీ కాదని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాదులు తీసుకెళ్లారు. 50 మంది అపోలో వైద్యులను విచారించామని, వాళ్లు చెప్పిన విషయాలతో నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించబోతున్నట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని వాదించారు.

జయలలిత మరణంలోని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ఆర్ముగ స్వామి కమిషన్‌ను విస్తరించేందుకు లేదా, ద్విసభ్య కమిషన్‌గా మార్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, విచారణ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి కొనసాగించాల్సి ఉంటుందని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు సాగాయి.

చదవండి: ‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్‌ఐని చంపేశాం..

మరిన్ని వార్తలు