70 ఏళ్ల వింతతువు ఇంట్లో కోతుల దొంగతనం

19 Aug, 2020 12:55 IST|Sakshi

చెన్నై: కోతులు ఇళ్లలోకి దూరి అందినకాడికి వస్తువులు, తినుబండరాలను ఎత్తుకెళ్లడం సాధారణంగా జరిగే ఘటన. కానీ అలా ఎత్తుకెళ్లిన వాటిలో జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము, బంగారం ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది తమిళనాడుకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి. పాపం కష్టసమయంలో అక్కరకు వస్తుందని దాచిన సొమ్ము ఇలా కోతుల పాలు కావడంతో విపరీతంగా బాధపడుతుంది ఆ వృద్ధురాలు. వివరాలు.. తిరువైయారూకు చెందిన 70 ఏళ్ల వితంతువు జి. శరతంబల్‌ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె బట్టలు ఉతకడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో కోతులు ఆమె ఇంట్లో చేరి అరటి పళ్లు, బియం సంచి తీసుకుని పారిపోయాయి. పాపం శరతంబల్‌ ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన సొమ్ముతో పాటు కొద్ది పాటి బంగరాన్ని కూడా బియ్యం సంచిలోనే ఉంచింది. కోతులు వీటన్నింటిని తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాయి. (బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!)

ఇంటికి తిరిగి వచ్చిన శరతంబల్‌కి‌ బియ్యం సంచి కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూసింది. ఇంటి పైకప్పు మీద కోతుల చేతిలో ఉన్న బియ్యం సంచి చూసి.. తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ కోతులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దాంతో శరతంబల్‌ వాటిని అనుసరిస్తూ వెళ్లింది. విషంయం తెలిసిన స్థానికులు కోతులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. బియ్యం సంచిలో 25 వేల రూపాయల నగదుతో పాటు కొద్దిపాటి బంగారం కూడా ఉన్నట్లు తెలిపింది శరతంబల్‌. ఆమె ఎంత ప్రయత్నించినప్పటికి కోతులను పట్టుకోలేకపోయింది. అత్యవసర పరిస్థితుల్లో అక్కరకు వస్తుందని భావించి.. జీవితాంతం కష్టపడి దాచిన సొమ్ము ఇలా కోతుల పాలవడంతో విచారంలో మునిగిపోయింది శరతంబల్‌.  ఇప్పటికైనా కోతులు గ్రామంలోకి ప్రవేశించకుండా చూడాలని కోరుతున్నారు గ్రామస్తులు. 

మరిన్ని వార్తలు