-

యాడ్‌ దుమారం: ‘నా ఒడి నింపే వేడుక’

15 Oct, 2020 20:42 IST|Sakshi

తనిష్క్‌ యాడ్‌కు మద్దతుగా ఫొటోలు షేర్‌ చేస్తున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్‌ రూపొందించి యాడ్‌ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముస్లిం కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన హిందూ మహిళ సీమంతం వేడుక థీమ్‌తో రూపొందిన ఈ ప్రకటనపై ఓ వర్గం నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. లవ్‌ జీహాదీని ప్రోత్సహించేలా ఉన్న ఈ యాడ్‌ను ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారంటూ విమర్శల వర్షం కురిసింది. అంతేగాక దీని కారణంగా తనిష్క్‌ భారీ నష్టం చవిచూస్తుందని, #BoycottTanishq పేరిట హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ చేసి ఆగ్రహం ప్రదర్శించారు. (చదవండి: యాడ్‌ తొలగించిన తనిష్క్‌.. వివరణ)

దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన సంస్థ..‘‘సవాళ్లతో కూడిన ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భిన్న వర్గాల ప్రజలు, కుటుంబాలను ఒక్కచోట చేరుస్తూ, అందరూ కలిసి ఉంటే కలిగే ఆనందాన్ని సెలబ్రేట్‌ చేయడమే తమ ఏకత్వం(ఈ పేరుతోనే కొత్త కలెక్షన్‌ ప్రవేశపెట్టింది) క్యాంపెయిన్‌ వెనుక ఉన్న అసలు ఉద్దేశం’’ అని వివరణ ఇచ్చింది. అంతేగాకుండా మనోభావాలు గాయపడినందుకు చింతిస్తున్నామని పేర్కొంటూనే, తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు దృష్ట్యా ఈ యాడ్‌ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు. గుజరాత్‌లో కొంతమంది నిరసనకారులు తనిష్క్‌ స్టోర్‌కు వెళ్లి మరీ క్షమాపణ కోరాల్సిందిగా బెదిరింపులకు దిగారు. అంతేకాదు, ఈ వీడియో తొలగించినంత మాత్రాన, చేసిన తప్పు ఒప్పైపోదని, ఇకపై తనిష్క్‌ జువెలరీ కొనే ప్రసక్తే లేదంటూ మరికొంత మంది సోషల్‌ మీడియా వేదికగా తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. 

వీరి అభిప్రాయం ఇలా ఉంటే, ఇంకొంత మంది మాత్రం, యాడ్‌ తొలగించినందుకు తనిష్క్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు వస్తూనే ఉంటాయని, మతసామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉన్న ఈ వీడియోను వెనక్కి తీసుకోవడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ వంటి సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఈ వివాదానికి మూలకారణంగా భావిస్తున్న మతాంతర వివాహం గురించి, అటువంటి పెళ్లిళ్లు చేసుకున్న కొన్ని జంటలు మాత్రం ఈ యాడ్‌ తమకు చక్కగా సరిపోతుందంటూ పాత ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. అసలు ఇందులో అంతగా తప్పుపట్టాల్సిన విషయం ఏముందని, కులాలు, మతాలు వేరైనంత మాత్రాన, ప్రేమానురాగాలు, ఆప్యాయతల్లో మార్పు ఉండదని, మంచి మనసు ఉంటే అంతా కలిసి సంతోషంగా ఉండవచ్చని తమ వైవాహిక జీవితంలోని ఆనందపు క్షణాలను సోషలల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. 

నా ఒడి నింపే వేడుక
నటి- డైరెక్టర్‌ రసికా అగాషే, నటుడు మహ్మద్‌ జీషన్‌ ఆయుబ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనిష్క్‌ యాడ్‌ దుమారం నేపథ్యంలో తన సీమంతం నాటి ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘నా ఒడి నింపే కార్యక్రమం.. లవ్‌ జిహాద్‌ అని ఏడుపు లంకించుకునే ముందు ప్రత్యేక వివాహ చట్టం అని ఒకటి ఉంటుంది. దాని గురించి తెలుసుకోండి’’అని తనదైన శైలిలో చురకలు అంటించారు. ఆమెతో పాటు నటి‌, బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ కబీర్‌ ఖాన్‌ సతీమణి మినీ మాథుర్ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భిన్నసంస్కృతుల కలయికగా నిలిచిన తన వివాహం తనకెన్నో సంతోషాలను, అవధులు లేని ప్రేమను పంచిందని, ద్వేష భావాన్ని విడనాడితే అంతా బాగుంటుందని పేర్కొన్నారు.

ఇక వీరితో పాటు నిఖిల్‌ పర్వాల్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన జరా ఫరూఖీ అనే నెటిజన్‌ కూడా నాలుగేళ్ల క్రితం జరిగిన తన పెళ్లినాటి ఫొటోలను పంచుకున్నారు. ‘‘మతం మారితే ఏం మారుతుంది’’అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక మరో జంట 44 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో ఎన్నోకష్టాలకు ఓర్చి ఇప్పుడు ఓ ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నామంటూ గోవాలోని తమ ఇద్దరి మతాచారాల మొదటి అక్షరాలు కలిసివచ్చేలా ఇంటి పేరును (హమ్- మనం‌)హెచ్‌యూఎమ్‌ అని పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు