అత్యాచారం కేసులో తేల్చిచెప్పిన గోవా కోర్టు

21 May, 2021 12:43 IST|Sakshi

పనాజీ: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ నిర్దోషిగా బయటపడ్డాడు. అతడు నిర్దోషి అని గోవా కోర్టు తేల్చి చెప్పింది. 2013లో థింక్‌ ఇన్‌ గోవా సమావేశంలో తనను తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగికంగా వేధించాడంటూ ‘తెహల్క.కమ్‌’కు చెందిన మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన పోలీసులు అదే ఏడాది నవంబర్‌ 30వ తేదీన అరెస్ట్‌ చేశారు. 

దీనిపై గోవా కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఆరోపణలపై తేజ్‌పాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తప్పుడు ఆరోపణలని, ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్‌ వేశారు. బెయిల్‌ కోసం కూడా విజ్ఞప్తి చేశారు. విచారణ చేసి 2014 జూలై 1వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

తదనంతరం తనపై ఆరోపణలను కొట్టివేయాలని.. కేసు రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో గోవా కోర్టులో విచారణ జరిగి చివరకు 2021 మే 21 శుక్రవారం నాడు తీర్పు వెలువడింది. తరుణ్‌ తేజ్‌పాల్‌ నిర్దోషి అని పేర్కొంటూ పేర్కొంది. ఏడున్నరేళ్ల తర్వాత తీర్పు వెలువడడంతో తేజ్‌పాల్‌ కుమార్తె కారా తేజ్‌పాల్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన న్యాయవాది దివంగత రాజీవ్‌ గోమొస్‌కు తేజ్‌పాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఇటీవల కరోనాతో మృతిచెందాడు.

మరిన్ని వార్తలు