స్కాలర్‌ షిప్‌తో చదివాడు.. భారత రాష్ట్రపతి అయ్యాడు

10 May, 2021 18:32 IST|Sakshi
మాజీ భారత రాష్ట్రపతి కెఆర్‌ నారాయణన్‌

న్యూఢిల్లీ : టాటా గ్రూపు స్కాలర్‌ షిప్‌తో విదేశంలో చదువుకుని భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన కెఆర్ నారాయణన్ స్పూర్తిదాయక కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టాటా గ్రూపు బ్రాండ్‌ కస్టోడియన్‌ హరీశ్‌ భట్‌ లింక్డ్‌ఇన్‌లో ఈ కథను షేర్‌ చేశారు. గత కొద్దిరోజులుగా ‘షార్ట్‌ టాటా స్టోరీస్‌’ పేరిట సంస్థ ద్వారా లబ్ధిపొందిన వారి కథలను ఆయన తన ఖాతాలో పోస్టు చేస్తున్నారు.

తాజాగా, ‘ఏ టాటా స్కాలర్‌’ పేరిట మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ కథను షేర్‌ చేశారు.  ‘‘1940లలో ఓ యువకుడి స్కాలర్‌ షిప్‌కు సంబంధించిన ఓ లేఖ జేఆర్‌డీ టాటాకు అందింది. ఆ లేఖలో.. ‘కేఆర్‌ నారాయనణ్‌ అనే యువకుడు ట్రావెన్‌కోర్‌ యూనివర్శిటీలో ఎంఏలో మొదటి ర్యాంకు సాధించాడు. ఎంఏ పూర్తి చేయటానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అతడు చాలా పేద కుటుంబానికి చెందిన వాడు. తండ్రి నెలకు సంపాదించే  20 రూపాయలు మాత్రమే తొమ్మిది మంది ఉన్న కుటుంబానికి ఆధారం. కెఆర్ నారాయణన్ ఇంగ్లాండ్‌లో ఉన్నత చదువులు చదవాలని ఆశిస్తున్నాడు’ అని ఉంది.

టాటా గ్రూపు జారీ చేసిన స్కాలర్‌ షిప్‌ ప్రతి

టాటా గ్రూపు అతడ్ని ఇంటర్వ్యూ చేసింది. అతడు ఇంటర్వ్యూలలో మంచి మార్కులు సాధించాడు. టాటా గ్రూపు స్కాలర్‌ షిప్‌ ఇ‍వ్వటానికి ముందుకొచ్చింది. 16 వేల రూపాయల స్కాలర్‌ షిప్‌, రూ. 1000 లోన్‌ను అందించింది. దీంతో అతడు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదివాడు. 1949లో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీసెస్‌లో చేరాడు. 1992లో భారత ఉప రాష్ట్రపతిగా..1997లో రాష్ట్రపతిగా అయ్యాడు. ప్రతీ భారతీయుడికి స్పూర్తిదాయకంగా నిలిచాడు’’ అని రాసుకొచ్చారు. టాటా గ్రూపు జారీ చేసిన స్కాలర్‌ షిప్‌కు సంబంధించిన కాపీని పోస్ట్‌ చేశారు.

చదవండి : లక్ష ఏ‍ళ్ల నాటి ఆదిమానవుల అవశేషాలు.. వాళ్లను చంపింది..

మరిన్ని వార్తలు