టౌటే ఎఫెక్ట్‌; మూగబోయిన టీవీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్‌ 

19 May, 2021 14:03 IST|Sakshi

ముంబై (మహారాష్ట్ర): టౌటే తుఫాన్‌ ప్రభావంతో సోమవారం అనేక చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాటిని విద్యుత్‌ అధికారులు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తున్నప్పటికీ, ఆ స్తంభాలు, చెట్ల మీదుగా వెళ్లే కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ కేబుల్‌ వైర్లు తెగిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్‌ ఫ్రం హోమ్‌) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీటి పైపులు, విద్యుత్‌ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు భూగర్భంలో నుంచే ఉన్నాయి. అయితే, వాణిజ్య, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు, నివాస భవనాలకు, చాల్స్, మురికివాడలకు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్‌ సేవలు, టీవీ కేబుల్‌ కనెక్షన్లు ఇస్తున్నాయి.

వీటికి సంబంధించిన కేబుల్‌ వైర్లు భూగర్భంలో నుంచి లేవు. చెట్ల కొమ్మల మీదుగా లేదా విద్యుత్‌ స్తంభాల మీదుగా, ఎత్తయిన భవనాల టెరెస్‌ల పైనుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైర్లు వేసి, ఇంటింటికి కేబుల్‌ టీవీ, ఇంటర్నెట్‌ సేవలు అందిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి టౌటే తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షం, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. దీంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాల మీదుగా వెళ్లిన టీవీ కేబుల్‌ వైర్లు, ఇంటర్నెట్‌ కేబుళ్లు తెగిపోయాయి. అక్కడక్కడా అమర్చిన రిలే బాక్స్‌లలోకి వర్షపు నీరు వెళ్లడంతో షార్ట్‌ సర్క్యుట్‌ అయ్యి కాలిపోయాయి. ఫలితంగా మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లలో టీవీలు మూగబోయాయి.

ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఖాళీగానే కూర్చున్నారు. ఇదిలావుండగా కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో గత నెల రోజులుగా అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీ చూడటం లేదా మొబైల్‌ ఫోన్లతో కాలక్షేపం చేయడం తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం లేదు. సోమవారం రాత్రి నుంచి కేబుల్, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియక వారు గందరగోళంలో పడిపోయారు. లాక్‌డౌన్‌ కాబట్టి బయటకు వెళితేనేమో పోలీసుల లాఠీ దెబ్బలు, చివాట్లు తప్పవు. కేబుల్, ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు, విద్యార్థులు, యువతీ యువకులు, గృహిణులు రోజంతా ఇంట్లో కాలక్షేపం ఎలా చేయాలని ప్రశ్నించుకుంటున్నారు.

గత్యంతరం లేక కేబుల్‌ ఆపరేటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఇలా తరచూ వందల ఫోన్లు వస్తుండటంతో కేబుల్‌ ఆపరేటర్లు విసుగెత్తిపోతున్నారు. మరోపక్క లాక్‌డౌన్‌ ఆంక్షలతో విద్యుత్‌ సామగ్రి విక్రయించే షాపులన్నీ మూసి ఉంటున్నాయి. దీంతో కేబుల్‌ వైర్లు, విద్యుత్‌ పరికరాలు, రిలే బాక్స్‌లు దొరకడం లేదు. పైగా, టీవీ కేబుల్‌ సేవలు ప్రారంభించాలని కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కేబుల్‌ ఆపరేటర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసి పెడుతున్నారు. కేబుల్, ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి రావాలంటే ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలే మని ఆపరేటర్లు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు