Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే

15 Dec, 2022 05:30 IST|Sakshi

పార్లమెంట్‌లో విపక్షాల పట్టు, వాకౌట్‌

న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికులతో భారత సేన ఘర్షణ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించాల్సిందేనన్న ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ అంశాన్ని రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చించే ప్రసక్తేలేదని ఇరుసభల సభాపతులు తేల్చిచెప్పడంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభలో ప్రశ్నావళి ముగియగానే సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘1962లో భారత్‌–చైనా యుద్ధంపై స్వయంగా ప్రధాని నెహ్రూనే చర్చించారు.

ఆనాడు 165 మంది సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఇప్పుడూ తవాంగ్‌లో చైనా దుందుడుకుపై సభలో చర్చించాల్సిందే’ అని పట్టుబట్టారు. చర్చించాలా వద్దా అనేది సభావ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా స్పష్టంచేశారు. ఇందుకు ఒప్పుకోబోమంటూ కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు సైతం వేర్వేరు అంశాలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, ఎన్‌సీ పార్టీల సభ్యులు కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్ని చర్చించాలంటూ రాజ్యసభలోనూ విపక్షాలు డిమాండ్ల మోత మోగించాయి. అయితే, ఈ అంశంపై చర్చకు ముందస్తు నోటీసు ఇవ్వనికారణంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్‌ చర్చకు నిరాకరించారు.  ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీ, ఆర్‌జేyీ  తదితర పార్టీల సభ్యులు వాకౌట్‌ చేశారు.   
 

>
మరిన్ని వార్తలు