ట్యాక్సీ డ్రైవర్‌ ఆత్మహత్య: ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన‌

31 Mar, 2021 18:13 IST|Sakshi
కారులో ఆత్మహత్యాయత్నం చేసిన ట్యాక్సీ డ్రైవర్‌ ప్రతాప్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

టాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం: బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం

బెంగళూరు: డ్రైవర్‌ ఆత్మహత్యకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో విమానశ్రాయంలో టాక్సీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. కర్ణాటక టూరిజం శాఖలో పని చేస్తున్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ మంగళవారం సాయంత్రం తన కారులో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు డ్రైవర్‌ బుధవారం ఉదయం మరణించాడు. ఈ క్రమంలో ట్యాక్సీ డ్రైవర్లు నిరసన తెలుపుతుండటంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రకటన చేసింది. ఈ మేరకు ‘‘బీఎల్‌ఆర్‌ఏ విమానాశ్రయంలో ట్యాక్సీ సేవలను నిలిపివేస్తున్నాం. ప్రయాణికులు బీఎంటీసీ బస్సు సేవలను, వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం’’ అంటూ ట్వీట్‌ చేసింది. 

రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ప్రతాప్‌ (32) అనే ట్యాక్సీ డ్రైవర్‌ మంగళవారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతడిని కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడి హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రతాప్‌ బుధవారం ఉదయం మరణించాడు. ఇందుకు నిరసనగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ విమానాశ్రయం ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరిస్తాం అని తెలిపారు. ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘ప్రతాప్‌ మృతికి కారణాలు తెలియదు. తీవ్రంగా గాయపడటంతో అతడి వద్ద నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేకపోయాం’’ అని తెలిపాడు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు