Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును

6 Sep, 2022 05:34 IST|Sakshi
వికలాంగ ఉపాధ్యాయుడికి వేదిక దిగి వచ్చి మరీ అవార్డ్‌ ఇస్తున్న రాష్ట్రపతి ముర్ము

టీచర్స్‌ డే ప్రోగ్రాంలో రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. 

మరిన్ని వార్తలు