ఎడారి బాట పట్టిన బడిపంతుళ్లు.. మీ సేవకు సలాం!

11 Jul, 2021 19:00 IST|Sakshi

జైపూర్‌: కరోనా మహమ్మారి చాలా రంగాల్లో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్‌ క్లాస్‌లు మొదలయ్యాయి. అయితే తాజాగా ఫోన్‌లు, మొబైల్‌ నెట్‌వర్క్‌లు లేని విద్యార్థుల కోసం రాజస్థాన్‌లోని ఉపాధ్యాయులు ఎడారి బాట పట్టారు. ఎడారి ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల కోసం బార్మెర్‌లోని ఉపాధ్యాయులు ఒంటెలపై ప్రయాణించి అక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై రాజస్థాన్ విద్యా శాఖ డైరెక్టర్ సౌరవ్ స్వామి మాట్లాడుతూ.. “రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థులలో చాలామందికి మొబైల్ ఫోన్లు లేవు.

దీంతో ఉపాధ్యాయులు వారానికి ఓసారి 1 నుంచి 8 తరగతులు, వారానికి రెండుసార్లు 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధించాలని రాజస్థాన్‌  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.” అని అన్నారు. ఇక భీమ్తాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ రూమ్ సింగ్ జఖర్ మాట్లాడుతూ.. "కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సకాలంలో నోట్స్ అందించడానికి కృషి చేస్తున్నారు. ఈ ఉపాధ్యాయుల బృందానికి నా వందనం, కృతజ్ఞతలు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి.” అని అన్నారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..‘‘ ఉపాధ్యాయుల కృషిని చేతులెత్తి వందనం చేస్తున్నాను. వారి కృషి అభినందనీయం.’’ అంటూ కామెంట్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు