వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి

16 Nov, 2022 03:58 IST|Sakshi

చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్‌ నగర్‌ గవర్నమెంట్‌ పెరిఫెరల్‌ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్‌.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్‌ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్‌ నగర్‌ గవర్నమెంట్‌ పెరిఫెరల్‌ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్‌ చేసి, కంప్రెషన్‌ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు.

వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (ఆర్‌జీజీజీహెచ్‌) రెఫర్‌ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్‌ పెరిఫెరల్‌ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు