ప్రధాని మోదీ మెచ్చుకున్న టీనేజ్‌ గర్ల్‌.. అసలు ఎవరీ తనిష్క సుజిత్‌!

11 Apr, 2023 19:28 IST|Sakshi

తనిష్క సుజిత్, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థి. 11 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేసుకుని.. 15 ఏళ్లకే బీఏ ఫైనల్‌ పరీక్షలు రాసేందుకు సిద్ధమైంది.  దీని అనంతరం లా కోర్పు చదివి భారత ప్రధాన న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. 2020లో కోవిడ్‌తో తన తండ్రి, తాతలను కోల్పోయిన ఈ యువతి.. ఆ బాధను దిగమింగుకుని మనో ధైర్యంతో తన లక్ష్య సాధనవైపుగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌ కోసం రాష్ట్ర రాజధాని భోపాల్‌కు వెళ్లిన తనిష్క.. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి దాదాపు 15 నిమిషాలు ముచ్చటించారు.

తాను బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక యుఎస్‌లో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని, ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి కావాలని కలలు కన్నానని ప్రధాని చెప్పినట్లు తెలిపింది. "నా లక్ష్యం గురించి విన్న ప్రధాని మెచ్చుకున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయవాదుల వాదనలు చూడాలని నాకు సలహా ఇచ్చారు. అది నా లక్ష్యాన్ని సాధించడానికి నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధానిని కలవడం నాకు ఒక కల నిజమైంది" అని ఆమె చెప్పారు.

దేవి అహల్య విశ్వవిద్యాలయం సోషల్ సైన్స్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య మాట్లాడుతూ.. సుజిత్‌కు 13 సంవత్సరాల వయస్సులో విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక ప్రతిభ చూపడంతో బీఏ (సైకాలజీ) మొదటి సంవత్సరంలో ప్రవేశం లభించిందని తెలిపారు. ఆమె ప్రతిభను మెచ్చిన యూనివర్శిటి యాజమాన్యం బీఏ (సైకాలజీ)లో ప్రవేశం కల్పించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు