టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపి వార్నింగ్‌.. 40 సార్లు కాలుస్తా అంటూ.. 

6 Oct, 2023 17:11 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమ స్కూల్‌కు చెందిన టీచర్‌పై గన్‌తో కాల్పులు జరిపి.. 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు.

వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ సెంటర్‌లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్‌ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ సందర్భంగా సదరు విద్యార్థులు తాము గ్యాంగ్‌స్టర్లమని నినాదాలు చేశారు. ఇక, ఆ యువకులు.. టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. మరోవైపు టీచర్‌ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు అనంతరం ఒక రీల్‌ చేశారు. వీడియోలో ‘ఆరు నెలల తర్వాత తిరిగి వస్తా. ఆ టీచర్‌ను 40 సార్లు కాల్చుతా, ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయి’ అని ఒక విద్యార్థి అందులో పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. టీచర్‌పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్లీజ్‌ ఆదుకోండి.. హరిరామజోగయ్య పేరిట వీహెచ్‌కు ఫోన్ చేసి.. 

మరిన్ని వార్తలు