వచ్చే ఏడాదిలో తేజస్‌ మార్క్‌–2

1 Feb, 2021 11:06 IST|Sakshi

2023లో హైస్పీడ్‌ ట్రయల్స్‌ 

హెచ్‌ఏఎల్‌ చీఫ్‌ మాధవన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్‌ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సీఎండీ ఆర్‌.మాధవన్‌ వెల్లడించారు. తేజస్‌ మార్క్‌–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ ఉంటాయని వివరించారు. తేజస్‌ మార్క్‌–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్‌ ట్రయల్స్‌ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్‌ జెట్‌ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్‌ఏఎల్‌ తయారు చేసిన తేజస్‌ మార్క్‌–1ఏ రకం 73 జెట్‌ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు.

వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్‌–2 జెట్ల తయారీ 2025 మొదలై 6 నుంచి 8 ఏళ్ల నడుస్తుందన్నారు. దీంతోపాటు, 5 బిలియన్‌ డాలర్ల మేర ఖర్చయ్యే 5వ తరం మీడియం ఫైటర్‌ జెట్‌ విమానం తయారీపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీని నమూనా 2026 వరకు సిద్ధమవుతుందనీ, ఉత్పత్తి 2030 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. హెచ్‌ఏఎల్, డీఆర్‌డీవోతోపాటు మరో రెండు ప్రైవేట్‌ రంగ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశాలున్నాయని మాధవన్‌ తెలిపారు. ఇందులో రూ.2,500 కోట్ల పెట్టుబడి ప్రైవేట్‌ సంస్థలది కాగా, మిగతాది తాము భరిస్తామన్నారు. చైనా జేఎఫ్‌–17 యుద్ధ విమానం కంటే తేజస్‌ మార్క్‌–1ఏ జెట్‌ ఎంతో మెరుగైందని ఆయన వివరించారు. ఇంజిన్, రాడార్, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలతోపాటు సాంకేతికత పరంగా కూడా చైనా జెట్‌ కంటే మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు