కొత్త కార్లు వద్దు! అందర్నీ నమస్తే! అదాబ్‌ అని పలకరించండి!

20 Aug, 2022 14:16 IST|Sakshi

పట్నా: బిహార్‌లో మహాఘట్‌ బంధన్‌ కూటమితో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో ఆర్జేడీ నుంచే అధిక సంఖ్యలో 31 మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ తన పార్టీలోని మంత్రులకు కొన్ని సూచనలు జారీ చేశారు. కొత్త కారులను కొనుగోలు చేయవద్దని, అందరిని నమస్తే, అదాబ్‌ వంటి పదాలతో పలకరించే సంప్రదాయాన్ని పాటించాలని చెప్పారు.

అంతేకాదు  ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకోవాలని, పేద ప్రజలతో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కులానికి ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు. అలాగే బోకేలు లేదా పువ్వులను బహుమతులుగా ఇచ్చే బదులు పెన్‌లు లేదా పుస్తకాలు ఇచ్చుకోవాలని సూచించారు. మంత్రులెవరూ కూడా తమ శ్రేయోభిలాషులు, మద్దతుదారులు, కార్మికులను తమ పాదాలను తాకేందుకు అనుమతించకూడదని గట్టిగా నొక్కి చెప్పారు.

పైగా మంత్రులు ఆయా శాఖలను బాధ్యతయుతంగా నిర్వర్తిస్తూ, పారదర్శకంగా వ్యవహరిచాలని కోరారు. అంతేగాక మంత్రులు తాము చేసే అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో తెలస్తుందని చెప్పారు. మరోవైపు బీజేపీ జంగిల్‌ రాజా మళ్లీ వచ్చాడు, ఆ పార్టీ మంత్రులంతా నేరచరిత్ర కలిగినవాళ్లు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ తరుణంలో తేజస్వీ యాదవ్‌ తన మంత్రులంతా సత్ప్రవర్తనతో, పారదర్శకంగా పరిపాలన సాగించాలంటూ కొత్త మార్గదర్శకాలను సూచించారు. 

(చదవండి: లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి)

మరిన్ని వార్తలు