BMC Elections: ఉద్ధవ్‌ మాస్టర్‌ ప్లాన్‌.. తేజస్వీ యాదవ్‌తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా?

24 Nov, 2022 14:50 IST|Sakshi

మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీతో కలిసి షిండే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, శివసేన వర్గంలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. 

ఈ క్రమంలో రానున్న బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలపై ఉద్ధవ్‌ వర్గం ఇప్పటి నుంచి ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో అక్కడ నివసిస్తున్న ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే శివసేన నేత ఆదిత్య థాక్రే.. బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను పాట్నాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున తేజస్వీని ప్రచారం కోసం ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, శివసేన కోరిక మేరకు తేజస్వీ యాదవ్‌.. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రాంతంలో యూపీ, బీహార్‌ వలసవాసులు దాదాపు 50 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వీరి ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ క్రమంలో శివసేనుకు చెందిన ఉద్ధవ్‌ వర్గం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇక, ఉద్ధవ్‌ థాక్రే సైతం.. 2024 రాబోయే లోక్‌సభ ఎన్నికల కన్నా బీఎంసీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్‌ వర్గం విజయం సాధిస్తే రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికల కోసం బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు