బయటకు మాత్రమే అవి బస్తాలు; అసలు కథ వేరే ఉంది

8 Aug, 2021 14:11 IST|Sakshi

మామిడి, కుంకుడుకాయల మాటున రవాణా 

ఇద్దరిపై కేసు నమోదు 

టెక్కలి రూరల్‌: కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మాటున రవాణా అవుతున్న గుట్కా ప్యాకెట్లను టెక్కలి పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడి నుంచి అక్రమంగా గుట్కా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు టెక్కలి సీఐ ఆర్‌ నీలయ్య, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు సిబ్బందితో కలిసి నర్సింగపల్లి  వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు.

ఈ సమయంలో ఏపీ 39టీఎం 8581 నంబర్‌ బొలేరో వాహనంలో కుంకుడుకాయలు, మామిడి ముక్కల బస్తాల మధ్య అక్రమంగా రవాణా చేస్తున్న 19 బస్తాల గుట్కా, 30 మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వ్యాన్‌తో పాటు గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ముదిలి బాలకృష్ణ, సవర చిన్నలపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు