కరోనా వ్యాక్సిన్‌ వృథాలో తెలంగాణ నంబర్‌ వన్‌

17 Mar, 2021 19:37 IST|Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్‌ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్‌ వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్‌ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్‌ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్‌ వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్‌ వృథా వివరాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది.

వాస్తవంగా వ్యాక్సిన్‌ వృథాను పది శాతంలోపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పది శాతానికి కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ 17.6 శాతం వ్యాక్సిన్‌ వృథా చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ 11.6 శాతం వృథా చేసి రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌ 9.4 శాతం వృథా చేసి మూడో స్థానంలో ఉంది. కర్నాటక మాత్రం జాతీయ రేటు 6.5 శాతం సమీపంలో 6.9 శాతంగా ఉంది. ఇదే నేపథ్యంలో కరోనా తీవ్రరూపంలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలకు కొన్ని సలహాలు ఇచ్చింది. రాష్ట్రాలకు మొత్తం 7.54 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 16వ తేదీన భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్‌ ఇప్పటివరకు 3.58 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మార్చి 15 వరకు 8 మిలియన్ల డోస్‌లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు