Pariksha Pe Charcha:‘పరీక్షా పే’ చర్చలో అక్షర.. 9వ తరగతి విద్యార్థినికి ప్రధాని మోదీ సమాధానం

28 Jan, 2023 16:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (రాయదుర్గం): ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రశ్నించే అవకాశం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్‌ నవదోయ విద్యాలయలోని 9వ తరగతి చదివే ‘అక్షర’కు కలిగింది. ఈ కార్యక్రమంలో అక్షర వీడియో ద్వారా ప్రధాని నరేంద్రమోదీని ‘మల్టిపుల్‌ ల్యాంగ్వేజ్‌లను నేర్చుకోవడానికి విద్యార్థులు ఏమి చేయాలి?’ అని ప్రశ్నించింది.

పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఈ ప్రశ్నను ఇద్దరు విద్యార్థినిలు ప్రధాని దృష్టికి తేగా ఆయన స్పందిస్తూ దేశంలోని ప్రతి విద్యార్థి కూడా తన మాతృభాషతోపాటు ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక వాక్యం మాట్లాడడానికి అవకాశం కలిగేలా చూడాలని కోరారు. దేశంలో ఎన్న భాషలు ఉన్నాయో..వాటన్నింటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు.

ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో మొదటిసారిగా జవహర్‌నవోదయ విద్యాలయ విద్యార్థినికి అవకాశం కలుగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని జవహర్‌నవోదయ విద్యాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రొజెక్టర్‌ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్‌ డానియల్‌ రత్నకుమార్‌ ఆధ్వర్యంలో తిలకించారు. అక్షర ప్రశ్న వచ్చే సమయంలో జేఎన్‌వీ విద్యార్థులంతా కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం అక్షరను అభినందించారు.

జేఎన్‌వీకి అవకాశం రావడం సంతోషకరం
జాతీయ స్థాయి కార్యక్రమం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో జేఎన్‌వీ రంగారెడ్డి జిల్లా విద్యార్థినికి అవకాశం రావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్‌ డానియల్‌ రత్నకుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థిని అక్షర ఎంపిక కావడం, ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి వచ్చి వీడియో షూట్‌ ద్వారా అక్షర ప్రశ్నను తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు.  చదవండి: ‘తల్లిని చూసి నేర్చుకోండి.. లైఫ్‌లో షార్ట్‌ కట్స్‌ వద్దు’

మరిన్ని వార్తలు